నాకీ రాజకీయాలు వద్దు..

21:37 - July 9, 2018

కరీంనగర్ : రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా రామగుండంలో జరుగుతున్న రాజకీయా పరిణామాలతో మనస్తాపం చెందిన సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే... మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంలో మంత్రి కేటీఆర్‌ మందలించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

రాజకీయల నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనస్తాపానికి గురై సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగానే కాకుండా... ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం
కొన్ని రోజుల క్రితం రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని సోమారపుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సోమారపు కార్పొరేటర్లతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే కొంతమంది కార్పొరేటర్లు ఇందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన మాటలు కార్పొరేటర్లు పట్టించుకోనప్పుడు.. వారి ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు.

సోమారపుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌
అయితే... సోమారపు నిర్ణయం వెనక పార్టీ అంతర్గత కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం విసయంలో పార్టీ అధిష్టానం సోమారపుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. మంత్రి కేటీఆర్‌ సోమారపుపై మండిపడినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం, కేటీఆర్‌ సీరియస్‌ నేపథ్యంలోనే సోమారపు కార్పొరేటర్ల చర్చలు జరిపినట్లు... అవి ఫలించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే... సోమారపు నిర్ణయం పట్ల పార్టీలో చర్చ కొనసాగుతోంది. మరోవైపు కార్పొరేటర్లు కూడా సోమారపుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని... పట్టణాన్ని అభివృద్ధి చేయలేని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సోమారపు... గోదావరిఖనిలో బొగ్గుగని కార్మికుల వద్ద వెల్లబోసుకున్నారు. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలు.. మరోవైపు అవిశ్వాసం వెనక్కి తీసుకోవడానికి కార్పొరేటర్లు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

2 రోజుల్లో ఎమ్మెల్యేగా రిలివ్‌ అవతానంటూ వెల్లడి
ఇక సోమారపు.. ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రామగుండలో ఎవరికీ టికెట్‌ ఇచ్చినా గెలుస్తారని.. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానన్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను కానీ... విశ్రాంతి తీసుకుంటానన్నారు సోమారపు. మొత్తానికి మేయర్‌పై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం.. సోమారపు రాజకీయ జీవితంపై ప్రభావితం చూపించింది. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశం... మరోవైపు కార్పొరేటర్ల తీరుతో సోమారం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. అయితే... ఈ పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Don't Miss