ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఏపూరి సోమన్నకు సంకెళ్లు

21:51 - September 1, 2017

సూర్యాపేట : ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను పాట, మాట రూపంలో ఎండగట్టినందుకు కవి, గాయకుడికి చేతులకు సంకెళ్లు వేశారు. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం వల్లే సోమన్నపై కంటగింపుకు పాల్పడారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారు. ఎమ్మెల్యే సతీమణికీ పోలీసులు జీహుజూర్‌ అంటోన్నారు. తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్నకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు సంకెళ్లు వేశారు. చేతులకు బేడీలు వేసి పోలీసు స్టేషన్ లోని లాకప్ కు కట్టేశారు. టెర్రరిస్టులను బంధించినట్లు స్టేషన్ లో బంధించారు. సోమన్న గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు వైఫల్యాలను, కుటుంబ పాలనను తన పాట, మాట, రాతలతో ఎండగడుతున్నారు. ఆకాశమే హద్దుగా సర్కారుపై ఆయన పోరుబాట సాగిస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ఆయన కంటగింపుగా మారారు. సోమన్న కుటుంబంలో కలహాలను ఆసరాగా తీసుకొని.. నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్ప... సోమన్న చేతులకు సంకెళ్లు వేయించి అరెస్ట్ చేయించారు. తీవ్రమైన నేరాలు చేసిన వారిని కూర్చోబెట్టినట్లు బేడీలతో కూర్చోబెట్టడంపై కవులు, కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో వివాదాన్ని సాకుగా చూపి తనను వేధిస్తున్నారని సోమన్న ఆరోపించారు. ఎమ్మెల్యే భార్య పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు సంకెళ్ళు వేయించారని అన్నారు. పీఎస్‌లో ఎమ్మెల్యే భార్య  పంచాయతీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss