దళితుల సింహ గర్జన...

06:31 - June 11, 2018

వరంగల్ : దళితులు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్ట సభలకంటే ప్రజా బాహుళ్యంలోనే బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని హన్మకొండలో జరిగిన దళితుల సింహగర్జన సభ పిలుపునిచ్చింది. దళితుల సమస్యలపై పార్లమెంట్‌ బయటా, వెలుపలా మద్దతు లభించడం లేదని నేతలు తెలిపారు. ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల చట్టంలో అక్షరం మార్చినా ఊరుకోబోమని దళితనాయకులు హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను నిరిసిస్తూ... ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హన్మకొండలో సింహగర్జన పేరుతో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన దళిత నాయకులు హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, సీపీఐ నేతలు సురవరంతోపాలు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అత్యాచారాలు 60శాతం పెరిగాయని నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా రోజూ 11 మంది దళితులు హత్యలకు, ఆరుగురు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘటితంగా పోరాడినప్పుడే దళితులపై అత్యాచారాలు ఆగిపోతాయన్నారు. ఇందుకు వరంగల్‌ సింహగర్జన శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ పిలుపునిచ్చారు. సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం ద్వారానే దళితులు తమ హక్కులను సాధించుకోగలరని ప్రకాశ్‌ అంబేద్కర్‌ చెప్పారు.

ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఒక అక్షరం మార్చినా ఊరుకునేది లేదని మందకృష్ణ ప్రకటించారు. చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని, అందుకోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. జనాభాలో ఒకశాతం ఉన్నవాళ్లు పాలకులవుతుంటే... 30శాతం ఉన్న దళితులు బానిసలుగానే ఎందుకు బతకాలని ఆయన ప్రశ్నించారు. దళిత, గిరిజనుల రక్షణ వృక్షాన్నే మోదీ పెకలిస్తున్నారని... దళితులు సంఘటితమై మోదీపై యుద్దం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని మార్చితే ఊరుకునే ప్రసక్తేలేదని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు తేల్చి చెప్పారు. సభలో జోరు వర్షం కురిసినా సభికులు వర్షంలో తడుస్తూనే నాయకుల ప్రసంగాలు విన్నారు. నాయకులు సైతం జోరు వర్షంలోనూ ప్రసంగాలు చేశారు. మొత్తానికి దళితుల ఐక్యతోనే హక్కులు సాధించుకోగలమని నాయకులు వారికి పిలుపునిచ్చారు. 

Don't Miss