షాక్ ఇచ్చిన ధోనీ..

07:01 - January 5, 2017

జార్ఖండ్ : ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని 2017 ఆరంభంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం టెస్ట్‌మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్‌కోహ్లికే వన్డేలు, టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు
భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకునిగా మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి సంచలనానికి వేదికయ్యాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆస్ర్టేలియాతో సిరీస్‌లో అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏళ్ల ధోనీ... తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేశాడు.

వన్డేలు, టీ 20లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం
భారత వన్డే, టీ20 ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ 20లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు పట్టుమని పదిరోజుల ముందు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. ధోని నిష్క్రమణతో టెస్ట్‌లకు ప్రస్తుతం సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీకి పూర్తి పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా జట్టుతో కలిసి కొనసాగుతానని మహీ తెలిపాడు. టీం ఇండియా ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ధోని అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.

199 వన్డేలు, 72 టీ 20 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు
మహేంద్రసింగ్ ధోనీ 199 వన్డేలు, 72 టీ 20 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ధోని కెప్టెన్సీలో వన్డేల్లో 110 విజయాలతో 59.57 శాతం సక్సెస్ రేట్‌తో భారత్ దూసుకుపోయింది. పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. టీ-20 మ్యాచ్‌లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్‌గా ధోనీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలోనే 2007లో టీ-20, 2011లో వన్డే ప్రపంచకప్పు భారత్ కైవసం చేసుకుంది. 2007 సెప్టెంబర్ నుంచి టీ 20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోనీ, 2007 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ నుంచి వన్డేలకు బాధ్యతలు చేపట్టాడు. 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన గంగులీ రికార్డును ధోని అధిగమించాడు.

ధోనీ నిర్ణజీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
ధోనీ అనూహ్య నిర్ణయానికి గల కారణమేమిటనేది అభిమానుల మదిలో మెదలుతున్న ప్రశ్న. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయన్నది క్రికెట్‌ విశ్లేషకుల మాట. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ధోనిని ప్రముఖ క్రికెటర్లు కొనియాడారు. క్రికెట్ వన్డే, టి20 ఫార్మట్లలో కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. షాక్‌కు గురైనా ధోనీపై అభిమానం కురిపించారు. ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ధోనీపై కామెంట్ల వర్షం కురిపించారు. ధోనీ లాంటి కెప్టెన్ మరొకరు లేరంటూ ప్రశంసలు కురిపించారు. ధోనీ ఫొటోలు పెట్టి అభిమానం చాటుకున్నారు. మొత్తంగా ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.

Don't Miss