ఎన్నికల హామీలేమయ్యాయి? : తమ్మినేని

10:19 - December 23, 2016

పెదపల్లి : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని తమ్మినేని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మార్గమేమిటన్న అన్వేషణలోంచి ఈ పాదయాత్ర మొదలైందని తమ్మనేని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని తమ్మినేని అన్నారు.

పాదయాత్రకు 67 రోజులు పూర్తి
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 67వ రోజు పూర్తి చేసుకుంది. 14 జిల్లాల్లో పర్యటించిన తమ్మినేని బృందం 67వ రోజు 15వ జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్రకు పలు ప్రజాసంఘాలు, న్యాయవాదులు మద్దతు తెలిపారు.

కోల్‌బెల్ట్‌ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి : శోభన్ నాయక్
కోల్ బెల్ట్‌లో సింగరేణి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్‌నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌బెల్ట్‌ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని శోభన్‌నాయక్‌ కోరారు.

కేసీఆర్ కు తమ్మినేని మరో లేఖాస్త్రం
67వ రోజు మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన సీపీఎం పాదయాత్ర నత్‌పూర్‌, అరుణక్కనగర్‌, ఇందారం ఎక్స్‌రోడ్‌, ఇందారం, గోదావరి, గంగానగర్‌ వరకు కొనసాగింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. పాదయాత్రకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు పాదయాత్ర మొత్తం 1770 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సింగరేణి కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.  

Don't Miss