83 రోజులు..2200 కి.మీటర్లు..

09:33 - January 8, 2017

జనగాం : కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఖాళీలున్నా.. ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. పేదవారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఒక్క దళితుడికి భూమి కానీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కానీ కేటాయించలేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు చాలా మంది ఉన్నారని, లక్షల కొద్దీ ఖాళీలు ఉంటే ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని తమ్మినేని ప్రశ్నించారు.

దుర్భర జీవితం..
దళితులు గ్రామాలకు దూరంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని పాదయాత్ర బృందం ఉపనాయకులు, సీపీఎం నేత జాన్‌ వెస్లీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ప్రవేశ పెట్టే సమయంలో మంత్రులు, సీఎం సభలో కూడా లేకపోవడం దారుణమని దుయ్యబట్టారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలను కేసీఆర్‌ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని జాన్‌వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జనగాం జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానిక కళాకారులు నీరాజనం పట్టారు. డప్పు దరువులతో పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు. జనగాం జిల్లాలో పర్యటిస్తున్న మహాజన పాదయాత్ర 83వ రోజులు పూర్తి చేసుకుంది. 83వ రోజు పాదయాత్ర బృందం కోలుకొండ, పెద్దతండా,కడవెండి, కామారెడ్డిగూడెం, చిప్పరాలతండా, సీతారాంపురం, దేవరుప్పుల గ్రామాల్లో పర్యటించింది. కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్థూపాన్ని తమ్మినేని బృందం ఆవిష్కరించింది. కామారెడ్డి గూడెంలో.. దేశ్‌ముఖ్‌లను ధిక్కరించిన షేక్‌ బందగీ సమాధిని పాదయాత్ర బృందం సభ్యులు సందర్శించి నివాళులు అర్పించారు. జనగాం జిల్లాలోని యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. జిల్లాలో అత్యధికంగా గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదని తమ్మినేని అన్నారు.

Don't Miss