తెలంగాణ అంటే ఎర్రజెండా..

09:23 - January 3, 2017

వరంగల్ అర్బన్ : ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ.. తెలంగాణలో పర్యటిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 78 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 2070 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ ముందుకు సాగుతోంది. కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే వరకూ సీపీఎం పోరాటం ఆగదని తమ్మినేని హెచ్చరించారు. 78వ రోజు సీపీఎం పాదయాత్ర వరంగల్‌ జిల్లా బావుపేట, ఎల్లాపూర్‌, హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ చౌరస్తా, ఎంజీఎం, పాచమ్మమైదాన్‌, కిలా వరంగల్‌ లో పర్యటించింది. యాత్రకు వరంగల్‌ అర్బన్‌ కమిటీ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో పూలవర్షంతో స్వాగతం పలికారు.

సీఎంకు లేఖలు..
తెలంగాణ టీఆర్ఎస్‌ ది కాదని, తెలంగాణ అంటే ఎర్రజెండా అని ఎర్రజెండా అంటే తెలంగాణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధన కోసమే తాము ప్రయత్నం చేస్తున్నామని తమ్మినేని అన్నారు. ఎర్రజెండాతో పాటు మిగతా జెండాలు కలిసి వస్తేనే తెలంగాణలో అట్టుడుగు వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. వరంగల్‌ నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంఖుస్థాపన చేశారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు కాలేదని తమ్మినేని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేరే దాకా.. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు జమిలి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని పిలుపునిచ్చారు. పాదయాత్ర దృష్టికి వచ్చిన అనేక సమస్యలపై సీఎంకు లేఖలు రాస్తున్నామని, ఈ మధ్య వాటికి కొంత స్పందన వస్తోందని తమ్మినేని అన్నారు.

ఐక్యంగా పోరాడాలన్న ఆశయ్య..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని, అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు కనీసం స్థిరనివాసం కూడా లేదని ఎంబీసీ నేత, పాదయాత్ర బృందం సభ్యుడు ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల గురించి అసెంబ్లీ చర్చించకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అసెంబ్లీలోనే బీసీ సబ్‌ప్లాన్‌ పెట్టాలని ఆశయ్య డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణం అయ్యేవరకు అట్టడుగు వర్గాల ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆశయ్య పిలుపునిచ్చారు.

2017 కి.మీటర్లు..
78వ రోజు మహాజన పాదయాత్ర 2017 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు జి రాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జి నాగయ్య, బి. వెంకట్‌, సుధాభాస్కర్‌, సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్‌, సీపీఎం అర్బన్‌ కార్యదర్శి వాసుదేవరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు. వరంగల్‌ నగరంలోని పలు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

Don't Miss