మహాకర్మ యుద్ధంలో పాల్గొనాలి - తమ్మినేని...

08:36 - January 9, 2017

జనగాం : ఎర్రజెండా చేబూని పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ సీపీఎం మహాజన ముందుకు సాగుతోంది. జనగాం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ప్రజాగాయకుడు గద్దర్‌ పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను చిన్నచూపు చూస్తోందని, వారికి గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర 84 రోజులు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర 84వ రోజు.. మైలారం, ధర్మపురం, విసునూరు, పాలకుర్తి, దరదెపల్లి, మల్లంపల్లి ఎక్స్‌రోడ్‌, వావిలాల గ్రామాల్లో పర్యటించింది. పాలకుర్తిలో జరిగిన సభలో డీసీసీబీ ఛైర్మన్‌ జంగారాఘవరెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద.. అంటూ తన గళం విప్పి యాత్రకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లు గడిచిపోయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినా ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ బతుకు చిత్రం మారాలంటే... వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. మార్క్స్‌, అంబేద్కర్‌, పూలేల సిద్ధాంతాల మేళవింపే ఈ దేశానికి విముక్తి ప్రసాదిస్తోందని తమ్మినేని అన్నారు. సామాజిక మార్పు కోరే ప్రతిఒక్కరూ ఈ మహాకర్మ యుద్ధంలో పాల్గొనాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

కళాకారుల పాత్ర కీలకం..
తెలంగాణ సమాజంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని తమ్మినేని అన్నారు. పేద కళాకారులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, కళాకారులందరినీ ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కళాకారులకు ఫించన్‌లు, గుర్తింపు కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు పాదయాత్ర 850 గ్రామాల్లో పర్యటించింది. పందొమ్మిది జిల్లాల్లో 2200 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. విస్నూర్‌గడీని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ప్రాణాలను నిలబెట్టే దవాఖానాను నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

Don't Miss