నిర్మల్ లో మహాజన పాదయాత్ర..

09:31 - December 12, 2016

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తమ్మినేని బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. నిర్మల్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ఎస్సారెస్పీ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని బహిరంగ లేఖ రాశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

56వ రోజు..
సామాజిక తెలంగాణే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 56వ రోజు పూర్తి చేసుకుంది. ఇప్పటికే 10 జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర.. ఈరోజు నిర్మల్‌లోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి నిర్మల్‌ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు పోచంపాడు, సోన్‌, గంజ్యాల్‌, కడ్తల్‌, చాకేరా, సోఫినగర్‌, నిర్మల్‌, చించోలి, డ్యాంగాపూర్‌లో 29 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర.. ఇప్పటికి సుమారు 1450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

ఘన స్వాగతం..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వచ్చే ఏడాది మార్చి 19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గ్రామ గ్రామాన తమ్మినేని బృందానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తమ సమస్యలను తమ్మినేని బృందానికి చెప్పుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బృంద సభ్యుడు రమణ అన్నారు. పాదయాత్రకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాములు, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమ సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ను కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని హేమ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంగన్‌వాడీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని.. కేసీఆర్‌ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

హామీల అమలేవి ? 
కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని తమ్మినేని అన్నారు. సామాన్య ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఎస్సారెస్పీ నిర్వాసిత గ్రామాల్లోని సమస్యలపై తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పాదయాత్రకు ఎమ్మార్పీఎస్‌, సామాజిక సంఘ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. 

Don't Miss