'కులాల అసమానతలు తొలగినప్పుడే అభివృద్ధి'

09:47 - January 7, 2017

జనగాం : కులాల మధ్య అసమానతలు తొలగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జనగామ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు విద్యార్థులు, ఐద్వా నేతలు ఘన స్వాగతం పలికారు.

విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం : తమ్మినేని
విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు జనగామలో కాలేజీ, పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు.

రాజకీయాల్లోని చెడు మాత్రనే వ్యతిరేకించాలి : తమ్మినేని
తెలంగాణ రాష్ట్రం బాగుండాలని.. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలతో పాటు.. అన్ని సౌకర్యాలు కలగాలనే లక్ష్యంతో సీపీఎం పాదయాత్ర చేస్తున్నట్లు తమ్మినేని తెలిపారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజల్లో చాలామందికి రాజకీయాలంటే చెడు అభిప్రాయం ఉందని.. కానీ దేశ అభివృద్ధికి రాజకీయాలు ముఖ్యమని విద్యార్థులతో మాట్లాడిన తమ్మినేని తెలిపారు. అయితే.. రాజకీయాల్లోని చెడు మాత్రనే వ్యతిరేకించాల్సిన అవసరముందని తమ్మినేని సూచించారు.

82వ రోజు జరిగిన పాదయాత్రకు ఐద్వా నేతల స్వాగతం
జనగామ జిల్లాలోని యశ్వంతాపూర్‌, ధర్మకంచె, నెల్లుట్ల, కిష్టగూడెం, చీటూరు గ్రామాల్లో 82వ రోజు జరిగిన పాదయాత్రకు ఐద్వా నేతలు స్వాగతం పలికారు. జిల్లాలు ఏర్పాటు చేయగానే సరిపోదని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే సార్ధకత ఉంటుందన్నారు తమ్మినేని.

50 ఏళ్లకు పైబడిన గొర్రెల కాపరులకు ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వాలి : తమ్మినేని
గొర్రెల పెంపకందారుల సమస్యలపై తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గొర్రెల కాపురుల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. 50 ఏళ్లకు పైబడిన గొర్రెల కాపరులకు ప్రభుత్వం పింఛన్‌ అందించాలని తమ్మినేని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Don't Miss