సంక్షేమం వదిలి.. ఆలయాలకు ఖర్చు : తమ్మినేని

10:28 - January 10, 2017

మహబూబాబాద్‌ : కేసీఆర్‌ ప్రభుత్వం పేదల సంక్షేమం వదిలి.. ఆలయాలకు కోట్లు ఖర్చు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పల్లెపల్లెలో చైతన్యం నింపుతూ.. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 85 రోజులు పూర్తి చేసుకుంది. జనగాం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని మహబూబాబాద్‌ జిల్లాలో ప్రవేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది.
నెరవేరని కేసీఆర్‌ హామీలు 
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని, పేదల సంక్షేమం వదిలేసి ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. ముందు ప్రజల సమస్యలు పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.  
రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరని తమ్మినేని ఆవేదన
ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా.. రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్టర్లు ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ వంటి సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించని కేసీఆర్‌ ఉత్తి మాటలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని తమ్మినేని దుయ్యబట్టారు. 
పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం 
ఇప్పటికే 19 జిల్లాల్లో పర్యటించిన తమ్మినేని బృందం.. 85వ రోజు జనగాం జిల్లా నుంచి మహబూబాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వరరావు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కళాకారుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. మేనిఫెస్టోలో ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్‌.. కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కళాకారులకు ఫించన్‌ సౌకర్యం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.  

 

Don't Miss