ఉత్సాహంగా సర్వసమ్మేళన సభకు..

18:36 - March 18, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న ముగింపు సభను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా జనవరి ఒకటివ తేదీన పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లాకు చేరుకుంది. నెల రోజుల పాటు జనగాం, వరంగల్ రూరల్, మహబూబా బాద్, జయశంకర్ జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగింది. 
నెరవేరని ప్రభుత్వ హామీలు : ప్రజలు 
ప్రభుత్వం ఇచ్చిన చాలా హామీలు నేరవేరలేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా ప్రజలు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సీయం కేసీఆర్ కు లేఖలు రాశారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 
సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం : రత్నమాల 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశవర్కర్లు, డ్వాక్రా మహిళాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రత్నమాల తెలిపారు. ఈ సమస్యలను పాదయాత్ర ముగింపు సభలో మరోమారు లేవనెత్తుతామన్నారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున వారి సమస్యలను సీపీఎం నాయకులకు వినిపించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఈ రంగాల నుంచి 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 
వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాసుదేవారెడ్డి          
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటూనే వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి. మొత్తమ్మీద ఈ సమస్యలన్నింటిని పాదయాత్ర ముగింపు సభలో లేవనెత్తుతామంటున్నారు సీపీఎం నాయకులు. ఈ నెల 19న జరిగే మహాజన పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నారు. 

 

Don't Miss