77వ రోజుకు సీపీఎం పాదయాత్ర..

18:18 - January 1, 2017

కరీంనగర్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర.. కరీంనగర్‌లో 77వ రోజు కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర ఇవాళ జిల్లాలోని చిలుకూరు, చిన్నరాజుపల్లి, రంగాపూర్‌, చిరతపల్లి, హుజురాబాద్‌ బెంచికలపేట ఎక్స్‌రోడ్డు, కోతులనడుమ, వీరనారాయణపూర్‌, దండేపల్లిలో కొనసాగనుంది.

2 వేల కిలోమీటర్లు పూర్తి
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఫలాలను అందించడమే ధ్యేయంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. అణగారిన వర్గాల ప్రజలను తట్టిలేపుతూ.. ప్రతివ్యక్తిలో చైతన్యాన్ని నింపుతూ సాగుతున్న పాదయాత్ర ఇవాల్టికి 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

పాద యాత్రకు తెలంగాణ జిల్లాల్లో లభిస్తున్న స్పందన

తెలంగాణలో ఉప్పెనై సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర తీరు. దాదాపు 15 జిల్లాల్లో.. వందలాది పల్లెల్లో ప్రజాచైతన్యాన్ని నింపుతూ తమ్మినేని బృందం 2 వేల కిలోమీటర్ల దూరం పయనించడం నిజంగా ప్రజా సమస్యల పట్ల సీపీఎం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. మేమున్నామంటూ.. ప్రజలతో మమేకమై సాగుతున్న యాత్రకు తెలంగాణ జిల్లాల్లో లభిస్తున్న స్పందన అపారం.

సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా తెలంగాణ పల్లెలు, తండాలు, వివిధ ప్రాంతాల్లో వెనుకబడిన వారందరినీ పాదయాత్ర బృందం పలకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటోంది. తండాలు, మండలాలు అన్న తేడా లేకుండా అడుగడుగునా పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. పాదయాత్రలో వెల్లువెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ... సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు రాస్తున్నారు.

2016 అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభం
2016 అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన మహాజన పాదయాత్ర. రెండు వేల మైలురాయిని చేరుకుంది. తమ్మినేని నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం.. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించ తలపెట్టి ఆ దిశగా ముందుకు సాగుతోంది.

21 రోజున వనపర్తి జిల్లాలో 500 కిలోమీటర్లు పూర్తి
సీపీఎం మహాజన పాదయాత్ర ఐదో రోజున రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌ సమీపంలోని కోళ్లవంపు గ్రామం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అలాగే 21వ రోజున వనపర్తి జిల్లాలో 500 కిలోమీటర్లు చేరుకుంది. ఇక 40వ రోజు మెదక్‌ జిల్లాలో 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాసంఘాల నేతలు పాదయాత్ర చేస్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మంబోజిపల్లిలో వెయ్యి కిలోమీటర్ల శిలాఫలకాన్ని తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.

పాదయాత్ర ఆశయం నెరవేరాలి : తమ్మారెడ్డి
తమ్మినేని పాదయత్ర 2వేల కిలోమీటర్లు పూరైన సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు. తమ్మినేని ఏ ఆశయం కోసమైతే పాదయాత్ర చేపట్టారో.. ఆ ఆశయం నెరవేరాలని తమ్మారెడ్డి భరద్వాజ ఆకాంక్షించారు.

40 రోజు మెదక్‌ జిల్లాలో 1000 కిలోమీటర్లు మైలురాయిని దాటిన పాదయాత్ర
ప్రతి పల్లెలో సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. తమ్మినేని బృందం సీఎంకు లేఖలు రాస్తోంది. ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తట్టిలేపుతూ.. సమస్యల పరిష్కారం దిశగా అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఇప్పటికే సగ భాగం పూర్తైన పాదయాత్ర... ఇదే ఉత్సాహంతో 4వేల మైలురాయిని పూర్తి చేసేందుకు తమ్మినేని బృందం ముందుకు సాగుతోంది.  

Don't Miss