సీపీఎం మహాజన పాదయాత్ర @77వ రోజు..

13:28 - January 2, 2017

కరీంనగర్ : ప్రజాసమస్యలను తెలుసుకుంటూ... ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ సీపీఎం మహాజన పాదయాత్ర కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. 77 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల బతుకులు మారకుండా తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే ప్రజలకు బతుకులు బాగున్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగాలు కూడా రావడం లేదని తమ్మినేని అన్నారు. సంపద ఒకే చోట కేంద్రీకృతం కారాదని, సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజలు సమాన అవకాశాలు పొందాలని రాజ్యాంగం చెబుతోందని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. సమాజంలో జరిగే పరిణామాలపై యువత ఆలోచన చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు పడతాయనుకుంటే.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు తెలుసుకుంటూ..
జనాభాలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాదయాత్రకు మద్దతు తెలిపిన పలువురు నేతలు అన్నారు. ఇప్పటికే 77 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రతిపల్లెలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ఎప్పటికప్పడు ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ ముందుకు సాగుతోంది. 77వ రోజు తమ్మినేని బృందం చిలుకూరు, చిన్నరాజుపల్లి, రంగాపూర్‌, చింతపల్లి, హుజురాబాద్‌, బెంచికలపేట ఎక్స్‌రోడ్డు, కోతులనడుమ, వీరనారాయణపూర్‌, దండేపల్లి, బావుపేట వరకు కొనసాగింది.

Don't Miss