దిగ్విజయంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర

11:37 - December 28, 2016

జగిత్యాల : ఎర్రజెండా చేబూని... కదం తొక్కుతూ..పదం పాడుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర దిగ్విజయంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 1890 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 
ప్రజలకు పయోగకరమైన చర్చలు జరగలేదన్న తమ్మినేని  
ఈ పదిరోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగకరమైన చర్చలు జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విఫలమయ్యాయని తమ్మినేని అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని తమ్మినేని అన్నారు. 
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల పరిస్థితి అత్యంత దారుణం : ఎస్.రమ 
రాష్ట్రంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కార్మికులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఈ ప్రభుత్వ హయాంలో నెరవేరడం లేదని పాదయాత్ర బృందం సభ్యురాలు ఎస్‌ రమ అన్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం పాదయాత్రకు మద్దతు తెలపుతున్నారని ఆమె తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో.. ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని రమ అన్నారు. 
పాదయాత్ర బృందానికి విశేష స్పందన : బి.వెంకట్  
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోందని పాదాయాత్ర కోఆర్డినేటర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన కుటుంబ పాలనను తలపిస్తోందని, కేసీఆర్‌ పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎలాంటి కొత్తదనం లేదని, గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని వెంకట్‌ అన్నారు. 
పాదయాత్రకు అపూర్వ స్వాగతం 
తెలంగాణ ప్రజల సమస్యలపై సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 72వ రోజు పూర్తి చేసుకుంది. జగిత్యాల జిల్లాలో పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రజలతోపాటు, ప్రజాసంఘాలు కూడా యాత్రకు మద్దతుగా నడక సాగిస్తున్నాయి. 
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
జగిత్యాల జిల్లా రంగదామ్‌పల్లి ఎక్స్‌రోడ్‌, తిర్మలాపూర్‌, గుంజపడుగ, గొల్లపల్లి, రాఘవపట్నం మీదుగా పాదయాత్ర జగిత్యాల వరకు సాగింది. భూసేకరణ సవరణపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

 

Don't Miss