'భక్తరామదాసు' ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చాలి : తమ్మినేని

10:27 - January 12, 2017

మహబూబాబాద్ : భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు, 8వేల 600 ఎకరాలు సాగులోకి వస్తాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. మహబూబాబాద్‌ జిల్లాలో తక్షణమే ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటు... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. 87వ రోజు మహాజన పాదయాత్ర మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగింది.
సామాజిక న్యాయమే ఎజెండాగా పాదయాత్ర 
సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగింది. 87వ రోజు అబ్బాయిపాలెంలో మొదలైన యాత్ర గాలివారిగూడెం, ఎల్లాదిగూడెం, పురుషోత్తమాయగూడెం, తండ ధర్మారం, లక్ష్మణ తండా, సీరోలు, రామచంద్ర తండా, రేకుల తండా, కాంపల్లి, పెరుమాళ్లసంకేత వరకు సాగింది. మొత్తం 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కూడా పాదయాత్ర కొనసాగింది.
డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు నీరందుతుందన్న తమ్మినేని  
తిరుమలాయపాలెం మండలంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రధాన కాలువ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం స్టోరేజీ కేంద్రాన్ని మహాజన పాదయాత్రం బృందం సభ్యులు సందర్శించారు. భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు నీరందుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు.  దీని ద్వారా 8,600 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. భక్తరామ దాసు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని తమ్మినేని ఆరోపించారు. తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని  ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు.
సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ  
మహబూబాబాద్‌ జిల్లాలో ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదని తమ్మినేని ప్రభుత్వానికి ఆరోపించారు. ఈ జిల్లాలో తక్షణమే ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.

 

Don't Miss