పాదయాత్ర అడ్డుకునేందుకు కుట్ర: తమ్మినేని

07:37 - December 24, 2016

పెద్దపల్లి : అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కొనసాగిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రను అడ్డుకునేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో సభను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై తమ్మినేని ఫైర్‌ అయ్యారు. బెదిరింపులకు భయపడేది లేదని తమ్మినేని హెచ్చరించారు.

రాష్ట్రం వచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు
తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో 68వ రోజు కొనసాగింది. గోదావరిఖని నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దపల్లి వరకు కొనసాగించి. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.

అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి : తమ్మినేని
తాను అధికారంలోకి వస్తే సింగరేణిలో ఓపెన్‌కాస్ట్‌లను మూసివేస్తామని చెప్పిన కేసీఆర్‌.. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదన్నారు. జిల్లాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజల బతుకులు బాగు పడవని.. ప్రజలకు ఏం కావాలో పాలకులు తెలుసుకోవాలన్నారు. 93 శాతం ఉన్న అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు తమ్మినేని.

పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు : తమ్మినేని
మరోవైపు సభ జరుగుతుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సభను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల తీరుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నా.. అక్కడక్కడ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాలకుల బెదిరింపులకు భయపడేది లేదని తమ్మినేని హెచ్చరించారు.

సింగరేణి ప్రాంతంలోని ప్రజలను ఆదుకోవాలి : నగేష్
సింగరేణి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పాదయాత్ర బృంద సభ్యుడు నగేష్‌ అన్నారు. తక్షణమే ప్రభుత్వం సింగరేణి ప్రాంతంలోని ప్రజలు ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గోలివాడలో పంపు హౌస్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి : తమ్మినేని
రామగుండం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఎన్టీపీసీ , రామగుండం ఎరువుల ఫ్యాక్టరీల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తమ్మినేని కోరారు. గోలివాడలో పంపు హౌస్‌ నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమివ్వాలన్నారు. ఈరోజు పాదయాత్రలో అంబేద్కర్‌ సంఘ నేతలు, సీపీఐ నేతలు, ఓపెన్‌కాస్ట్‌ నిర్వాసితులు కలిసి తమ సమస్యలను పాదయాత్ర బృంద సభ్యులకు విన్నవించుకున్నారు. 

Don't Miss