సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం : తమ్మినేని

11:46 - January 6, 2017

జనగాం : తెలంగాణ వచ్చినా.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, ప్రజల బతుకులు ఏ మాత్రం మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తమ్మినేని చెప్పారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి : తమ్మినేని
రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే.. ఇంకా వారి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తమ్మినేని అన్నారు.

పాదయాత్రకు సీపీఐ చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి సంఘీభావం
81వ రోజు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగుతున్న సీపీఎం పాదయాత్ర పూర్తి అంకితభావంతో కూడుకున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భవిష్యత్‌లో వామపక్షాలు ఐక్యతతో ముందుకు వెళతాయనేందుకు ఇదే నిదర్శనమని చాడ చెప్పారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా దుర్వినియోగం: నగేశ్
ఎస్సీ సబ్‌ప్లాన్‌ వచ్చి ఐదేళ్లయినా.. ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, ఎస్సీలకు కేటాయించిన ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని సీపీఎం పాదయాత్ర బృందం సభ్యులు నగేష్‌ విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా దళితుల అభివృద్ధికే ఉపయోగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీపీఎం పాదయాత్ర 81 రోజులు పూర్తి
ప్రజలను చైతన్య పరుస్తూ కొనసాగుతున్న సీపీఎం పాదయాత్ర 81 రోజులు పూర్తి చేసుకుంది. 81వ రోజు యాత్ర జనగాం జిల్లాలోని కుర్చపల్లి, రాఘవాపూర్‌, గోవర్ధనగిరి, కోమల్ల, రఘునాథపల్లి, నిడిగొండ గ్రామాల్లో పర్యటించింది. జనగాం జిల్లాలోని నాగుల చెరువుకు దేవాదుల నుంచి నీరందించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఇప్పాగూడలో పీహెచ్‌సీని ప్రారంభించాలని, స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించాలని లేఖలో పేర్కొన్నారు.  

Don't Miss