కేజీ టూ పీజీ ఏమైంది : తమ్మినేని

10:38 - December 21, 2016

మంచిర్యాల : కోమరంభీం జిల్లాలో చాలా సమస్యలున్నాయని... వాటిని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని సీపీఎం నేత తమ్మినేని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని ప్రభుత్వం గాలికొదిలేసిందని, దీంతో పేదలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివే అవకాశం లేకుండా పోయిందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.

65వ రోజులు..1700ల కి.మీటర్లకు పాదయాత్ర
పదండి ముందుకు.. పోదాం పోదాం అంటూ.. జనం బాట పట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 65వ రోజు పూర్తి చేసుకుంది. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి మొదలైన పాదయాత్ర.. మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. రెబ్బెన, గోలేటి ఎక్స్‌రోడ్, పులికుంట, తక్కెళ్లపల్లిరోడ్డు.. రేపల్లివాడ, ఐబీ చౌరస్తా, బోయపల్లి, బెల్లంపల్లిలో పర్యటించిన పాదయాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.

ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం : తమ్మినేని
టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ్మినేని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. అందరూ ఏకమై ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని తమ్మినేని హెచ్చరించారు. 65వ రోజు పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయా‌త్రకు పలు ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును వెంటనే తెరిపించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. పేపర్‌ మిల్లుపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. 

Don't Miss