ప్రజలే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారు :తమ్మినేని

09:22 - December 25, 2016

పెద్దపల్లి : ప్రజా సమస్యలపై చర్చించడంలో అసెంబ్లీ విఫలమైందని, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన మాట్లాడకుండా.. వ్యక్తిగత దూషణలకు దిగితూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ.. సమస్యలపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఆయన అన్నారు.

69వ రోజు వరకు 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో పల్లెపల్లెను పలకరిస్తూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 69వ రోజు పూర్తి చేసుకుంది. 69వ రోజు పెద్దపల్లి జిల్లా నిట్టూరులో ప్రారంభమైన పాదయాత్ర.. వెంకట్రావుపల్లి, కాచాపూర్‌, వడ్కాపూర్‌, జూలపల్లి గ్రామాల్లో పర్యటించింది. కాచాపూర్‌లో ప్రజాప్రంట్‌ వ్యవస్థాపకుడు ఆకుల భూమయ్య వర్ధంతి సభలో పాదయాత్ర బృందం పాల్గొంది.

ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్‌
ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉందని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తీవ్రంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సీఎం జీతాలను లక్షల్లో పెంచుకున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మునిసిపల్‌ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని తమ్మినేని దుయ్యబట్టారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీల పరిస్థితి దయనీయంగా ఉంది : నేతం రాజు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, కనీస వసతలు లేక ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గిరిజన సంఘం నేత నైతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు తమ్మినేని మరో లేఖ 
పెద్దపల్లి జిల్లా సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బసంత్‌నగర్‌, రాగినేడు భూముల సమస్యలతో పాటు రైస్‌ మిల్లులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు. గోదావరిఖని ఏరియాలో సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 

Don't Miss