కేంద్రానికి కార్మిక సంఘాల అల్టిమేటం..

06:38 - November 12, 2017

ఢిల్లీ : కార్మికుల నినాదాలతో హస్తినలో మూడోరోజు మహా పడావ్ హోరెత్తింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలపై నినదించారు. ఈరోజు ముఖ్యంగా అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు వేలాదిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు మహా పడావ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్లు బతుకమ్మ ఆడారు. కనీస వేతనాలు చెల్లించడంతో పాటు.. పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

కార్మికుల నిరసనలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక సంఘాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. జనవరి మొదటివారంలో దేశ వ్యాప్తంగా జిల్లా స్ధాయిలో సదస్సులు నిర్వహించాలని.. జనవరి చివర్లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కార్మికులు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించకపోతే సహించేది లేదని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు హెచ్చరించారు. మహా పడావ్‌ విజయవంతం చేసిన కార్మికులకు సీఐటీయూ తరపున సాయిబాబు విప్లవ వందనాలు తెలిపారు. మూడు రోజులుగా హస్తిన వీధుల్లో నినదించిన కార్మిక సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో ఆందోళనలు మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. 

Don't Miss