రాజమౌళి దర్శకత్వంలో అమరావతి శీన్మ......

20:06 - September 20, 2017

చీరెల పంచాది ఒడ్సిపోయిందేమో అనుకున్న.. అమ్మో ఎట్లొడుస్తది..? అయిపాయే మొగోళ్లకు జాంగలిచ్చినా బనీన్లిచ్చినా ఏం పంచాదిలేకుంటుండే... పొయ్యిపొయ్యి ముఖ్యమంత్రిగారి ఆడోళ్లతోని వెట్టుకున్నడు.. ఆ మంట సల్లారెతట్టు అనిపిస్తలేదు ఇప్పట్ల.. ఆ శీరెను జూశినప్పుడల్ల మంట మండుతున్నరు అమ్మలక్కలు.. ఇగ ఆడోళ్ల కోపం ఇట్లుంటే ఈటెల రాజేంద్ర సారు ఏమంటున్నడో ఇనుండ్రి..

అయ్యో ఈ రాజమౌళేంది..? ఆ అమరావతి నిర్మాణమేంది.?. ఇదేమన్న శీన్మనా..? లేకపోతె నాటికనా..? చంద్రాలు..? నీయక పెద్దపెద్ద సద్వులు సద్వినోళ్లతోని గాని డిజైన్ల గీత రాజమౌళి జేస్తాడు..? ఈ లెక్కన రాజమౌళి అనె మన్షి ఈ భూమ్మీద వుట్టకపోయినుంటే.. మరి ఏం జేస్తుంటివో ఏమోగని.. బాహుబలి సీన్మ సీన్లతోని బాగనే డ్రామా జేస్తున్నవ్ గదా..?

ఇచ్చిన శీరెలు తీస్కుంటె తీస్కొండ్రి లేకపోతె ఊకోండ్రి అంతెగని.. ఈ పిచ్చకుంట్ల రాజకీయం జేయకుండ్రి అని.. అంటున్నడు గౌరవనీయులు శ్రీ గాదరి కిషోర్.. తుంగతుర్తి ఎమ్మెల్యేగారూ.. ఆడోళ్లు కుఠిల రాజకీయం జేస్తరనంగ ఇన్నం.. కుల్లు రాజకీయాలు జేస్తరనంగ ఇన్నంగని.. మరి ఈ పిచ్చకుంట్ల రాజకీయం ఏడగనిపెట్టిండో ఏమో సారూ..?

ఇగురం మల్లారెడ్డి పెండ్లాం ఇల్లలుకుతుంటే.. పక్కింటి పెంటయ్య పరాష్కమాడిండట.. అగో అట్లనే ఉన్నది ఈ ముచ్చట.. మధ్యప్రదేశ్ రాష్ట్రంల ఒకతాన బీజేపీ మహిళామని స్వచ్చతా కార్యం బెట్టింది.. రోడ్లు సాపు జేసుడు అన్నట్టు.. అంతలనే ఆడికొచ్చిన ఒక మన్షి ఆమెను ఒక మాటన్నడు.. ఇగ గొట్టిందంటే ఆయనను.. మరి ఆయన ఏమన్నడు.. ఈమె ఎందుకు గొట్టిందో సూడుండ్రి..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి గారు మీకేమన్న శిగ్గున్నదా సారూ..? ఏమెల్గవెడ్తున్నరు సారూ తమరు..? పాపం పాతింట్ల బత్కుతున్న ఇద్దరు ముసలోళ్లను ఇంట్లకెళ్లి బైటికి ఎల్లగొట్టి.. వాళ్లను రోడ్డు మీద వడేశి మీ సావు మీరు సావుండ్రి అంటె.? మీ శాఖల పనిజేస్తున్న అధికారులకు గానీ..? మీకు గాని..? ఏమన్న బుర్ర పనిజేస్తున్నదా..?

అయ్యయ్యయ్యయ్యో.. ఎంత పనైపాయెనుల్లా..? సూస్తుంగనే మందిని మింగేశింది భూ కంపం.. ఇప్పటికి తెల్సిన లెక్క మూడు వందల మంది సచ్చిపోయిండ్రట భూకంపం జేయంగ.. మెక్సికో దేశం మొత్తం గజ్జున వన్కింది దెబ్బకు.. సరిగ్గ ముప్పై రెండేండ్ల కింద ఏ తేది నాడైతె వచ్చిందో భూకంపం సేయ్ ఇయ్యాళ గూడ అదే యాళ్లకొచ్చింది.. అప్పుడు పదివేల మంది సచ్చిపోయిండ్రట.. ఇప్పుడు లెక్క తెల్వలే ఇంక..

నీయక ఇప్పటి మన్సులు నిండ యాభై ఏండ్లు బత్కితెనే అబ్బో బాగనే బత్కిండు అంటున్నరు.. ఆ ఏన్కటి మన్సులు ఏంతిన్నరో ఏం కథనోగని.. ఎన్బై ఏండ్ల దాక గూడ ఎవ్వలి పని వాళ్లు జేస్కోని నూరేండ్లు దాటి బత్కిండ్రు.. ఒక ముసలామెనట నూట పదేండ్లున్నదట.. ఇప్పటికి నడుస్తున్నది.. ఆమె బల్గమంతొచ్చి బర్త్ డే జేస్తున్నరు పాండ్రి మనం పాలువంచుకుందాం..

Don't Miss