కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ ముచ్చట్ట జీవ సమాధి

20:20 - December 14, 2017

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. మీరు గడ్కోపారి మనది ధనిక రాష్ట్రం.. మనది సంపన్న రాష్ట్రం అని సూరత్ లేని మాటలు జెప్పకుండ్రి సారు.. శిగ్గనిపిస్తున్నది ఆ మాటలు ఇంటుంటే.. ఓదిక్కు ధనిక రాష్ట్రమని మీరు ప్రగతి భవన్ల బాతాలు జెప్తుంటరు.. ఇంకో దిక్కు అసెంబ్లీల అధికార లెక్కలేమో అప్పులళ్ల జిక్కిన రాష్ట్రమని తేల్తది... ఏంది సారూ మీ తమాష..?

ప్రజలను ఎట్ల మోసం జేయాలనే ముచ్చట్లు పట్టభద్రులు కేంద్రంల నరేంద్రమోడీ.. రాష్ట్రంల చంద్రబాబు నాయుడు ఈళ్లిద్దరే ఉత్తిర్ణులైనోళ్లు.. వీళ్లు పగటిపూజనే జనానికి చందమామను సూపెడ్తరు.. రాత్రి పూట సూర్యున్ని సూపెడ్తరు.. పబ్లీకును ప్రతిరోజు మోసం జేయ్మంటె గూడ చేస్తరు అట్లేంలేదు.. దానికి ఇగ వాళ్ల కథలు ఏశాలు ఒక్కటుండయ్..

ఆ ఆయిపోయింది.. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ ముచ్చట్టను జీవ సమాధి జేశిండు తెలంగాణ ముఖ్యమంత్రి గౌవరనీయులు.. పూజ్యులు.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారూ.. ఏయ్ జర్ర టీఆర్ఎస్ గెల్వని ఒక్కటే దెబ్బకు అందరం పర్మినెంట్ అయితమని.. అహోరాత్రులు కష్టపడ్డ కాంట్రాక్టు బిడ్డలారా..? మిమ్ములను రెగ్యులరైజ్ జేస్తె చీఫ్ సెక్రెటరీ.. అసొంటోళ్లు జైలుకు వోతరని ఆ కథకు ఉరివెట్టి ఊకున్నడు సారూ..

బత్కమ్మకు చీరెల పంపిణీ.. సంక్రాంతికి చంద్రన్నకానుకలు రంజాన్కు.. ఇఫ్తార్ విందులు.. క్రిష్మస్కు.. కానుకలిచ్చుడు.. ఇవ్వేనా..? తెల్గు రాష్ట్రాలళ్ల ఏ హిందువన్న మాకు సంక్రాంతి కానుకలు ఎందుకియ్యరి కొట్లాడిండా..? ఏ ముస్లీమన్న రంజాన్ విందుకు ఎందుకు ఇయ్యరని ధర్నా జేశిండా..? ఏ క్రిష్టియన్ అన్న.. మాకు కానుకలియ్యాలే అని కయ్యానికి దిగిండా..? కని ప్రభుత్వాలు వాళ్లను కాకవట్టెతందుకు వడ్తున్న కథలు ఇవ్వి..

టీఆర్ఎస్ పార్టీల కుడికాలు వెట్టేశింది మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి.. దీంతోని టీఆర్ఎస్ పార్టీ బలం ఇంక జర్రంత వెర్గిందని నేతలు చెప్పుకుంటున్నరు.. కని అది వాపును జూశి బలుపు అనుకునె సామెతనే అయ్యెతట్టున్నది.. టీఆర్ఎస్ పార్టీకి అసలైన దెబ్బ ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే తాకెతట్టనిపిస్తున్నది.. కారణం ఏంది అనేది ఈ కథల జూడుండ్రి..

ఆదివాసీ లంబాడీల నడ్మ రాజుకున్న పంచాది.. సారీ కొంతమంది రాజేశ్న పంచాది.. ఆఖరికి సమ్మక్క సారక్క జాతరకు గూడ తాకింది.. సమ్మక్కసారక్కకు వారసులం మేమంటే మేమని.. ఆదివాసీలు, లంబాడీలు.. పొర్కపొర్క గొట్టుకున్నరు.. పదిపదిహేను కార్ల అద్దాలు వల్గిపోయినయ్.. వనదేవతలను మళ్ల జనంల కెళ్లి వనంలకు వారిపోయెతట్టు అయ్యింది లడాయి..

హైద్రావాదుల సొంతిండ్లు గట్టుకోని బత్కుతున్న ప్రజలారా జర్ర జాగ్రత్త.. మీకు దెల్వకుంటనే మీ ఇండ్లను వేరేటోళ్లు అమ్మేస్తున్నరు.. మీ ప్రమేయం లేకుంటనే ఇండ్ల కాయిదాలు మారిపోతున్నయ్.. కోట్ల రూపాల విలువైన ఇండ్లు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు జర్గిపోయి బ్యాంకు లోన్లు గూడ మంజూర్లైపోతున్నయ్.. కావట్టి మీ ఇల్లు మీదేనా కాదా ఒక్కసారి మళ్ల చెక్ జేస్కోండ్రి ఎందుకైనా మంచిది.. ఇగో ఒకాయిన పని ఇట్లనే అయ్యింది.

గొల్ల కుర్మోళ్లకు గొర్లు ఇస్తమన్నం ఇచ్చినం.. అవ్వి ఉంటె మాకేంది సస్తె మాకేంది.? అన్నట్టే ఉన్నది అధికారుల పనితనం.. పేరుకే పెద్ద పథకం.. గొల్లకుర్మోళ్లంత కోట్లకు కోట్లు సంపాయించి.. సర్కారుకే అప్పులిచ్చేంత కలరింగుల పురుడువోస్కున్న ఈ పత్కం. రోజుకింత అనారోగ్యం పాలైతున్నది.. ఈ గోర్లేందో ఆ కథేందో పోండ్రి..

 

Don't Miss