నల్పై మూడు గొర్లను అరెస్టు జేశిన పోలీసోళ్లు..

21:30 - December 22, 2017

జేఏసీ చైర్మన్ కోదండరాం సారు మొండిపట్టోడే ఉన్నట్టుండుగదా..? యాత్రలు జేయనియ్యం అడ్డుకుంటమని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని శిక్కులు వెట్టినా.. అమరుల స్పూర్తి యాత్ర జర్గవల్సిందే.. మేము ప్రజలళ్ల తిర్గవల్సిందే అన్నట్టు.. మళ్ల సుర్వు జేశిండు యాత్ర.. ఇయ్యాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాల అయితున్నది.. 

ఏయ్ అనంతపురం పోలీసులు.. ఏం తమాష జేస్తున్నరా..? నేను జేసీ ప్రభాకర్ రెడ్డిని.. నా అణుచరున్ని అరెస్టు జేశేంత మొనగాళ్లైండ్రా మీరు..? అని తాడిపత్రి ఎమ్మెల్యే పోలీసోళ్లను బెదిరిచ్చి తన అనుచరున్ని ఇడిపిచ్చుకపోయిండు.. ఓ జేసీ ప్రభాకర్ రెడ్డి.. నువ్వేమన్న మొనగానివనుకుంటున్నవా.?? మొగులు మీదికెళ్లి ఊశిపడ్డోనివా..? నీకేం సప్రేటు సట్టాలుంటావ్ వా..? 

అంబర్ పేట అన్మంతన్న వాస్తవానికి కడ్పుల ఏం దాస్కునె మన్షిగాదు.. మన్సుల ఏదనిపిస్తె అదే అంటనే ఉంటడు.. ముంగట ఎవ్వలున్నది ఏం కథ సూడనే సూడడు.. ఎంతటోన్నిగూడ ఏం రాబాబు అంటడు.. అన్మంతన్న ముచ్చట ఇప్పుడెందుకంటె.. మొన్న జడ్చర్ల సభల గట్టిగనే చమక్కులు ఇశిరిండు.. ఏరిపెట్టిన అన్ని సూస్కోండ్రిగ..

తెలంగాణ ప్రభుత్వమా..? నీతాన ఏతులేనా ఏమన్న పనిజేశేది గూడ ఉన్నదా..? పాపం క్రిష్టియన్లను ఇంకెన్నేండ్లు సుడివెడ్తరు సార్లూ..? రెండువేల పద్నాలుగుల చెప్తిరి ముచ్చట.. పెద్ద క్రిష్టియన్ భవన్ గడ్తమని.. వచ్చె సారి వేడుకలు అండ్లనే అంటిరి.. మూడేండ్ల పొద్దాయే.. ఇద్వర్ దాక.. బునాది దొవ్వింది లేదు.. ఇంతకు తమరిని అడ్గినోడు ఎవ్వడు..? తమరెందుకు ఈ పనికిరాని హామీలిచ్చిండ్రు అనే పరేషాన్లున్నరు జనం..

జగిత్యాల జిల్లా మల్యాల పోలీసు స్టేషన్లకు గొర్లొచ్చినయ్.. నల్పై మూడు గొర్లను అరెస్టు జేశి స్టేషన్కు వట్కొచ్చిండ్రు పోలీసోళ్లు.. సర్కారిచ్చిన గొర్లను అమ్ముకుంటున్నరని అవ్విటిని దీస్కొచ్చిండ్రు.. మరి ఆ గొర్లకు గూడ థర్డ్ డిగ్రీ ఏయగాళ్ల మన ఫ్రెండ్లీ పోలీసులు ఏశినా ఏస్తరు.. ఓ గొర్ల ఓనరు లెక్కవెట్టుకో పోలీసోళ్ల చేతులకు వొయ్యినప్పుడు ఎన్నిగొర్లున్నయ్.. మళ్ల బైటికొచ్చెతప్పుడు ఎన్నున్నయే అనేది..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీకు నెలనెల జీతమొస్తలేదా సారూ..? పనిజేశినా చేయకపోయినా.. జీతం మాత్రం రూపాయి కట్ గాకుంట వస్తున్నదిగదా.?? మీకు మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు.. కష్టజేయనోళ్లకు జీతాలొస్తయ్.. కని పొద్దంత ఊడ్సి తూడ్సి పనిజేశెటోళ్లకు నాల్గు నెల్లకోపారి గూడ జీతం ఇయ్యకపోతె ఇదేం పద్దతన్నట్టు చెప్పు..?

అయ్యో పాడుగాను ఏమైందో ఏమో.. ఉత్తపుణ్యానికే ఏడ్గురు సచ్చిపోయిండ్రు ఒక్కటే ఇంట్ల.. యాదగిరి గుట్ట పక్కపొంటున్న రాజపేట మండలం కాడ.. నిన్న రాత్రి మరి ఏం దిన్నరో ఏం కథనో.. పన్నోళ్లు పన్నట్టే పాణం బొయ్యిగనవడ్డరు.. కూలినాలి జేస్కునెతందుకొచ్చినోళ్లు.. వాళ్ల ఇంటికొచ్చిన సుట్టాలు అందరు జీవిడ్సిండ్రు.. ఎంకువైరీ జేస్తున్నరట.. పాపం..

అప్పుదీస్కున్నోడు అప్పుగడ్తలేడని తీస్కునోళ్ల ఇంటోళ్లను ఇంట్ల వెట్టి తాళమేశిండు ఒకాయిన.. మరి ఇదే లెక్క ప్రకారం హామీలిచ్చి అమలు జేయని ప్రభుత్వాన్ని గూడ మనం ఇట్లనే ఒక ఇంట్లేశి తాళమేయాలన్నట్టా..? అరే ఇదెక్కడి లోకంరా నాయనా..? అప్పుదీస్కున్నోడు ఎల్లో ఎల్లకనో అవస్థవడ్తుంటే.. ఇంటోళ్లను నిర్బంధించుడు ఎంత వరకు మంచిది చెప్పుండ్రి..

ఓరినాయనో దొంగలు గూడ పెద్దగ కష్టపడకుంటనే దొంగతనాలు జేస్తున్నరుగదా?? మర్రి సూశెవర్కళ్ల మాయం.. వంగితె మాయం జేశినోళ్లను జూశ్నంగని.. వంగకముందుకే మాయం జేశెటోళ్లను మాత్రం ఇప్పుడిప్పుడే సూస్తున్నం.. అంత పది సెకన్లే.. పదిసెకన్లళ్లనే ఐదు లక్షల రూపాలు ఎట్ల దొంగతనం జేశిండ్రో సూడుండ్రి.. 

 

Don't Miss