'మీరంత ప్రతిపక్ష పార్టీకి ఓట్లేశిండ్రు మీకు పించిని ఇయ్యం'

20:45 - December 23, 2017

తెలంగాణ జేఏసోళ్లు వెట్టిన అమరవీరుల స్పూర్తి యాత్ర ఇయ్యాళ గూడ జోరుగనే అయ్యింది.. నిన్న నల్లగొండ కాడ బహిరంగ సభ వెట్టిండ్రు.. దానికి మంది బాగనే వచ్చిండ్రు.. ఇగ అదే జోషుతోని ఇయ్యాళ సూర్యాపేట కాడ గూడ సభ వెట్టిండ్రు.. మొత్తం మీద జేఏసీ మాత్రం ప్రతిపక్షాల కంటె ఫాస్టుల ప్రజలళ్లకు వోతున్నట్టనిపిస్తున్నది..

తెలంగాణ ప్రభుత్వ మన్సులు మంత్రులు గానీ.. ముఖ్యమంత్రిగానీ.. ఏడ తిర్గగల్గినా ఉస్మానియా యూనివర్సిటీల మాత్రం అడ్గువెట్టలేరు అంటున్నరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. మంద క్రిష్ణ మాదిగను అరెస్టు జేసుడు ఎన్క ముఖ్యమంత్రి కుట్ర జేశిండు.. ఆ కుట్ర సంగతి మేము గూడ జూస్కుంట ఎట్లానేది అంటున్నరు.. నాల్గురోజుల సంది కుతకుత ఉడ్కుతున్నరు వాళ్లు..

నిజాం షుగర్ ఫ్యాక్టరీ గన్క తెర్వకపోతె.. తెలంగాణ ప్రభుత్వానికి సుక్కలు జూపెట్టెతట్టే ఉన్నరు చెర్కురైతులు.. ఇగ ముఖ్యంగ.. దేవనపల్లి కవితమ్మకు ఉన్నది గోస.. వందరోజులళ్ల తెరిపిస్త ఫ్యాక్టరీ అని ఓట్లప్పుడు జేప్పింది.. మళ్ల అటువోయి సూస్తలేదు జనం మంటమీదున్నరు.. వంటవార్పుల దాక గూడ వొయ్యింది ఉద్యమం..

ఒక మన్షికి పించిని ఎట్లియ్యాలే.. ఆయనకు అర్హత ఉన్నదా లేదా సూస్కోని ఇయ్యాలే మన తెల్గు రాష్ట్రాలళ్ల..  అంతేనా..? కని మీరంత ప్రతిపక్ష పార్టీకి ఓట్లేశిండ్రు గావట్టి మీకు పంచిని ఇయ్యం అంటె ఏమన్నట్టు చెప్పుండ్రి.. అయ్యా పొద్దుటూరు టీడీపీ నేత వరదరాజుల రెడ్డిగారు.. మీ అయ్యాజాగీరేమన్న అమ్మి ఇస్తున్నరా పించిండ్లు లేకపోతె.. మీ చంద్రబాబు ఇంట్లపైకం వంచుతున్నడా..? ఆ..

మేము కొట్టినట్టు జేస్తం మీరు ఏడ్సినట్టు జేయుండ్రి.. ఆపాటికి సంకురాత్రి ఒడ్సిపోతది.. మీ కోడి పందాల కోరిక తీర్తది.. మనమంత గల్సి కోర్టును ఫూల్ జేద్దాం అన్నట్టు జెప్తున్నడు ఆంధ్రా హోంమంత్రి గారు.. కోడి పందాలు ఆడుకోండ్రి.. మేము అడ్డుకోము.. హైకోర్టు జెప్పిన దాని ప్రకారం నడ్సినట్టు యాక్టింగ్ జేస్తమంటున్నడు.. ఒక మంత్రిగారు మాట్లాడవల్సిన మాటనేనా ఇది..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల పోలీసోళ్లు ప్రజలకు సేవలు జేశేది.. ఇప్పుడు పరిపాలకులకు సేవలు జేసుడు వెట్టిండ్రు.. ఈ కథ ఇట్ల మారిన ముచ్చటకు ఫ్రెండ్లీ పోలీసు అని ఒక నామకరణం జేశి ఇడ్సిపెట్టిండ్రు.. వాస్తవానికి ఫ్రెండ్లీ పోలీసు అంటే.. ప్రజలతోని ఫ్రెండ్లీగాదు పాలకులతోని ఫ్రెండ్లీ అన్నట్టు.. గా పోలీసాయిన గంగిరెడ్డి కండకావురం సూడుండ్రి ఎట్లున్నదో..

దొంగలకు సద్దిగట్టుట్ల కరీంనరగ్ పోలీసోళ్లను మించి ముంగటికి వొయ్యిండ్రుగదా..? కడప పోలీసోళ్లు.. స్మశాన వాటికను కబ్జావెట్టినోళ్లను ఇడ్సిపెట్టి.. అదే స్మశానంల పీనిగేకు దహన సంస్కారాలు జేస్తందుకొచ్చినోళ్లను ఇయ్యర మయ్యర గొట్టిండ్రు.. అరే నాయన ఇంత కావురం ఎందుకో ఏమో..? ప్రజలంటె మీ చేత తన్నులు తినెతందుకే వుట్టిండ్రనుకుంటున్నరా ఎట్ల..? సూడుండ్రమ్మా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సారు జర్ర ఆత్మగళ్ల మన్షే ఉన్నట్టున్నడు.. సాటి మన్షికి అపాయం అయ్యిందని తెల్వంగనే ఎంటనే కారు ఆపి.. కాపాడి.. దావఖానకు గొంచవొయ్యి వైద్యం జేపిచ్చిండంటే.. గొప్పోడన్నట్టేగదా..? అందేకే స్పీకర్ సారు నిన్న మీరు జేశిన మంచిపనికి మల్లన్న ముచ్చట్ల తర్పున దండం బెడ్తున్నం.. 

తెలంగాణ రాష్ట్రంల మన్సులకిచ్చినట్టు కోతులకు గూడ ఓటు హక్కిస్తె అవ్వే ముఖ్యమంత్రి అయ్యెంత మందున్నది అవ్విటియి.. ఏం కోతులు అబ్బబ్బబ్బ.. అవ్విటిని సముదాయించెతందుకు ప్రత్యేక దళాలు వెట్టెకాలమొస్తదో ఏమో.. కోతుల ముచ్చటెందుకంటె.. మాజీ నల్లగొండ జిల్లా మోత్కురు కాడ కోతికి కరెంటి శాకు దల్గిందట కాపాడిండ్రు..

Don't Miss