సర్కారు తమాష గమ్మతుంటదివా...

21:55 - December 29, 2017

తెల్గురాష్ట్రాలళ్ల రాజకీయ పార్టీలు ఆడిన నాట్కానికి అమాయక జనం ఎట్ల బలైపోతున్నరో సూడుండ్రి.. వాళ్ల ట్రాపుల వడి.. ఎవ్వని శవాన్ని వాడే బుజం మీద ఏస్కోని పోతున్నడు.. కుట్రలను మాత్రం పశిగట్టలేకపోతున్నరు పేదలు.. ప్రజల నడ్మ ఎప్పుడు తాకులాటలు వెడ్తెనే ఈ అగ్రవర్ణ పార్టీలకు పట్టుంటది గావట్టి వాళ్లు ఎంత గొప్ప కుట్రలు జేస్తరో జర గమనించుండ్రి ప్రజలారా..

సూశిండ్రా ప్రజలారా..? కులాలుగ గాదు.. మన్షులుగ బత్కుదామని చెప్పినందుకు ఒక ఆడిబిడ్డను వట్కోని ఫేస్ బుక్కులళ్ల ఎన్నెన్ని మాటలంటున్నరో.. మనుధర్మశాస్త్రం మన్షులను విడగొట్టింది.. లేని కులాలను అంటగట్టింది.. అటువంటి శాస్త్రం మనకు అక్కెరలేదు అన్నందుకు.. పాపం సూరెపల్లి సుజాతా అనే దళిత బిడ్డ ఫొటోను ఫేస్ బుక్కుల వెట్టి కొంతమంది దొంగసాలేగాళ్లు గలీజు మాటలు తిడ్తున్నరు..

సర్కారు తమాష గమ్మతుంటదివా... పత్తిబాగవండినప్పుడు పత్తికొనుగోలు కేంద్రాలు వెట్టరు.. వరి బాగ వండినప్పుడు వరికొనుగోలు కేంద్రాలు వెట్టరు.. కందులు వండనప్పుడు కందుల కొనుగోలు కేంద్రాలు వెడ్తరు.. తెలంగాణల కందుల దిగుబడే ఈసారి అంతంత మాత్రమున్నది.. అంతంతున్న పంటకు ఆత్రంగ కేంద్రాలు.. అర్జెంటుగ మద్దతు ధరలు.. వారెవ్వ..?

చెప్పేటియి శ్రీరంగ నీతులు చేశేటియి ఏవో అన్నట్టు.. చంద్రబాబు జెప్పె ముచ్చట్లు అన్ని కమ్మగ అనిపిస్తయ్.. చేతలు మాత్రం రోతతీర్గుంటయ్.. నిన్న ఇకతాన మాట్లాడుకుంట... మాట్లాడుకుంట ఏమంటడు.. మనం బైటిదేశాలనుంచి నేర్చుకునుడు గాదు.. మన అమరావతిని జూశి బైటిదేశాలోళ్లు నేర్చుకోవాలె అంటున్నడు.. దేంతోని నవ్వాలే చంద్రాలు..?

పేరుకేమో.. మద్యపాన నిషేధ.. శాఖ.. దాని ఒర్జినల్ పని మద్యాన్ని తాగకుంట ప్రజలను రక్షించే కార్యం కని.. ఇయ్యాళ ఏం జేస్తున్నయ్.. ఆ శాఖలు.. ఏ వైన్సు ఎంత అమ్మాలే.. వాళ్ల టార్గెట్ ఎంత..? వైన్సుల పరిరక్షణ.. ప్రభుత్వానికి ఆదాయం బెంచే మార్గాలు.. ఒక్కమాటల జెప్పాల్నంటే ఇయ్యాళ ప్రభుత్వం బత్కుతున్నదే తాగువోతులమీద..

మామూల్గ ప్రజలు నిరసన దెల్పాలే.. రాజకీయ నాయకులు వాళ్ల కోరికలు నెరవేర్చాలు.. ప్రతిపక్షనాయకులు గూడ నిరసన తెల్పాలే.. ప్రభుత్వాలు నెరవేర్చాలే కని.. ప్రభుత్వం నడ్పుతున్న తెల్గుదేశం కార్పొరేటరే దీక్ష జేస్తున్నడు.. కోరిక నెరవేర్చవల్సింది మళ్ల ఆళ్ల సర్కారే.. ఇది పబ్లిసిటీ కోసం జేస్తరా..? లేకపోతె నిజంగనే జేస్తరా అనేది ఇది జూస్తె మీకే అర్థమైతది..

అమ్మా మీరు గ్రామపంచాది ఆఫీసుకు కరెంటి కట్ జేస్తారు బిడ్డా.. జర్రాగుండ్రి మీ కరెంటి ఆఫీసుకు తాళం ఏస్తమని ఏశిండ్రు.. గ్రామపంచాదికి కరెంటి ఆఫీసుకు నడ్మ న్యూటల్ వైరే షాకు గొడ్తున్నది.. ఆలేరు గ్రామపంచాది ఆఫీసర్లు.. కరెంటోళ్లు ఇద్దరు పట్టింపులకు వొయ్యి.. ఒకలిమీద ఒకలు అధికారం ఇసురుకుంటున్నరు..

కోతులు ఇంతా ఇంతా మన్షి రూపంలకు మారుతున్నట్టే అనిపిస్తున్నది.. మన్షి గూడ కోతి జాతికెళ్లే తయ్యారైండని అంటుంటరు.. కని కొన్ని కోతులు గమ్మతి జేస్తుంటయ్.. ఒక కోతి గొర్లు గాయవోతున్నది.. అడ్వి ఇడ్సిపెట్టి ఊర్లకొచ్చి గొర్ల మందెంటనే తిర్గుతున్నది.. యాదాద్రి బోనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట కాడ ఇచ్చంత్రం కోతి కథ జూడుండ్రి..

Don't Miss