ఈ శివరాత్రి ఒక్కపొద్దుల ముచ్చట

19:57 - February 13, 2018

ఈ శివరాత్రి ఒక్కపొద్దుల ముచ్చట జూస్తె గమ్మతుంటది.. అంటె నిష్టూరంగని.. అసలు ఆ ఒక్కపొద్దులేంటియి..? ఆ కథ ఏంది..? ఆ అభిషేకాలేంటియి.. ఉపాసం పేరుమీద ఒకాయిన తెల్లారంగ పండ్ల పుల్లేశి.. సాయంత్రందాక తోముకుంటనే గూసుంటడు.. సరే ఇవ్వన్ని ముచ్చట్లు గాదుగని.. కుద్దు ఒక పీఠాధిపతే జెప్తున్నడు మీరు అసలైన శివరాత్రి జేస్కుంటలేరని.. గాయిన మాటలన్న ఇనుండ్రి జర..

రెండువేల పందొమ్మిది అసెంబ్లీ ఎన్నికలళ్ల.. కాంగ్రెస్ పార్టీ తర్పున పోటీ జేశెటోళ్లది అర్వైమంది లిస్టు ఇడ్దల జేశిండ్రని సోషల్ మీడియాల రెండు పత్రాలు సంచారం జేస్తున్నది.. సరే అది ఎవ్వడు జేశింది ఏం కథ అనేది తర్వాతగని.. ఆ చేశే చెడ్పుపనిగూడ సక్కగ జేయరాకపాయే.. సచ్చినోనికి గూడ టికెట్టు ఇచ్చేశిండ్రంటే.. వారీ అవద్దంగూడ సరిగ సర్క్యూలేట్ జేయరాకపోతె ఎట్లరా నీకు అంటున్నడు పొంగులేటి..

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిగారు.. ఇంతకు మీరు కన్ఫ్యూజన్ల ఉన్నరా..? లేకపోతె జనమే కన్ఫ్యూజన్లున్నరా అర్థమైతలేదు.. ఒకసారి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం కెళ్లి ఎమ్మెల్యేగ పోటీ జేస్తాని నీ టికెట్ నువ్వే ప్రకటించుకుంటవ్.. మళ్లొకపారి.. ఈసారి నల్లగొండ పార్లమెంట్ స్థానంల పోటీ జేయవోతున్న అంటవ్..? వారంరోజులళ్లనే ఇంత కన్ఫ్యూజన్లుంటే.. ఏందన్నట్టు..?

తవురో రామన్న.. పేదోళ్ల ఉసురు దల్గి.. పోతవురో రామన్న.. మా బిడ్డల ఉసురు తలిగి.. పశిగుడ్డుల ఉసురుతలిగి.. పేదోళ్ల పొట్టగొట్టినోడు ఎవ్వడు పొడ్గుగాడు.. పుర్గులవడి సచ్చిపోతడు.. ఈ ముచ్చట బోజగుట్ట పేదల ఎంటవడ్డ దొంగ సర్కారు నాయకులదన్నట్టు.. పాపం నిండు గర్భిణి అని గూడ సూడకుంట నూకేశి ఇల్లు గూలగొట్టిండ్రంటే.. ఇంత దుర్మార్ఘమా..?

మీకెందుకు మీ పాతిండ్లన్ని కూలగొట్టుండ్రి.. తెల్లారే ముగ్గువోశి అద్భుతమైన.. ప్రపంచం నివ్వెర పోయే డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టిస్తమని పాపం దళితుల ఇండ్లను కూలగొట్టిచ్చిండ్రు.. మన బంగారు తెలంగాణ సర్కారోళ్లు.. చెర్లున్నోన్ని బాయిలేశినట్టు.. పాపం పాతిండ్లళ్ల బత్కుతున్న జనాన్ని రోడ్ల మీదేశి.. పత్తలేకుంట వారిపోయిండ్రు..

బహుజనుల వీరుడు.. మారోజు వీరన్నకు జన్మనిచ్చిన జాతి అది.. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం జేశిన జయశంకర్ సారుకు జన్మనిచ్చిన కులం అది.. మలిదశ ఉద్యమంల తొలి ఆత్మార్పణ జేశిన శ్రీకాంత చారిని కన్న జాతి అది.. ఎప్పుడు త్యాగాలకే పరిమిత మైన విశ్వబ్రాహ్మణ బిడ్డలు.. ఇప్పుడు ఒక్కటైతున్నరు.. త్యాగాలు మాయి బోగాలు మీయా అని ప్రశ్నిస్తున్నరు..

నీయక లేని ఇకమాతుల వడ్తున్నది ఈ తెలంగాణ సర్కారు.. ఇచ్చేదే ఒక్కటి రెండు సర్కులంటే.. అవ్విటికి మళ్ల ఏలుముద్రలు వెట్టాల్నంట.. రాషను దుక్నంల కథ జెప్తున్ననమ్మా..? పాపం కూలినాలి బంజేస్కోని తిర్గుతున్నం.. మా ముద్రలు కలుస్తలేవని బియ్యమిస్తలేరు అని జనం బాధపడ్తున్నరు.. సూడుండ్రి వాళ్ల గోస..

నిజాంబాదు జిల్లా నవీపేట మండలం జనాన్ని కొన్నిరోజుల సంది చుచ్చువోపిస్తున్న చిర్తపులి మొత్తం మీద జీవిడ్సింది.. గొర్లను మ్యాకలను.. సంపుకుంట సంచరిస్తున్నఈ పులి జెయ్యంగ జనం పాణాలు చేతుల వట్కోని బత్కిండ్రు.. ఎప్పుడు ఊర్లెకొస్తదో ఏం జేస్తదో అని భయపడ్డరు.. మొత్తం మీద మరి ఏబండి తాకిందో జీవిడ్సింది..

Don't Miss