గణపతిని పెద్దకులపోళ్లే వెట్టుకోవాల్నా..?

20:30 - September 6, 2017

హురక చెన్నమనేని రమేష్ సారు ఉన్నడుగదా..? అదే వేములవాడ ఎమ్మెల్యే ఆయన దొంగకాయిదాలు వెట్టి ఎమ్మెల్యేగ గెల్చిండట.. సుప్రీంకోర్టుల తీర్పొచ్చింది నిన్న.. ఆయన ఇండియా మన్షేగాదు.. ఎప్పుడో జర్మనీకి వొయ్యి బత్కుతున్నడు.. ఆయన ఆదేశ పౌరుడే మనదేశంల ఎట్ల పోటీ జేశి గెలుస్తడు..? అని స్వయంగ కోర్టే తీర్పు జెప్పిందట.. అమ్మ చెన్నమనేని..?

రాయలసీమ కంకర రత్నం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సారు షెట్టర్ కిందికి గుంజిండుగదా..? చల్ నీయక ఈ ప్రత్యేక రాయలసీమ..? సీమహక్కులు.. బండమీద నక్కులు అంటె ఎవ్వడింటలేడు.. ఇగ ప్రత్యేక రాయలసీమ దుక్నంల ఉద్దెర గిరాకి ఎక్వైంది.. నగదు ఆసాములు తక్వైండ్రని.. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ జెండా అవనతం జేశిండు..

రాజుల సొమ్ము రాళ్ల పాలైతె ఓకేగని.. జనం సొమ్ము దేవుండ్ల పాలైతెనే వస్తది పరేషాన్.. ఇద్వర్ దాక తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. సమర్పించిన మొక్కులు సరిపోనట్టున్నయ్.. ఈనెల ఇర్వైఏడు తారీఖు నాడు బెజవాడకు వొయ్యి ముక్కు పుడక ముట్టజెప్పొస్తడట.. ఇప్పటికే కోట్ల రూపాల జనం సొమ్ము దేవుండ్ల మొక్కులకు వెట్టిండు.. మరి ఇది ఏ తరీఖ యవ్వారం ఏం కథ అనేది జనం గూడ ఆలోచన జేయాలే..

మామూల్గ భజన జేయాల్నంటే.. తబలా మద్దెల తాళాలుంటే సరిపోతుండే ఎన్కట.. కని ఇప్పుడు ఏ వాయిద్య పరికరం లేకున్నా భజన జేస్తున్నరు కొంతమంది.. అట్ల జేస్తున్నోళ్ల దాంట్లె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఒకరు.. పుసుక్కున కేసీఆర్ సారు కుటుంబాన్ని ఎవ్వలన్న విమర్శిస్తె సాలు.. సారుకు శాతిమీద ఎంటికెలు వొడ్సుకొచ్చి.. మైకందుకుంటనే ఉంటడు.. మొన్నటి ఒక పంచాది మీద మైకందుకున్నడు..

అయ్యా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారి ధర్మపత్ని గారికి తెలంగాణ మహిళాలోకం చేసుకుంటున్న విన్నపం.. అమ్మా ఇంటాయినకు తాగుడు అల్వాటైతె ఆ సంసారం ఎట్లుంటదో మీకు తెల్సు.. మీ సారేమో ఒంటరి మహిళలకు పించిని అంటున్నడు.. మద్యం అమ్మి మమ్ములను ఒంటరి జేస్తున్నడు.. జర్ర మీరే ఆయన మన్సు మార్చాలే మేడం అంటున్నరు మహిళలు..

ఎమ్మెల్యేలు గానీ.. ఎంపీలుగానీ.. మంత్రులు గానీ..? ఒక్కనెల జీతం ఆల్చమైతె ఊకుంటరా..? లక్షలకు లక్షలు జీతగాళ్లే నెలగాదు.. ఒక్కరోజు లేటైనా పరేషాన్ అయితరు.. మరి అసొంటిది మున్సిపాల్టీలళ్ల పనిజేశే సఫాయోళ్లకు మూడు నెలల సంది జీతాలు ఇయ్యకపోతె..? వాళ్ల పెండ్లాం పిల్లలు ఎట్ల బత్కుతరు చెప్పుండ్రి..? వీళ్లది కడ్పుగాదా..?

గణపతిని ఓన్లీ పెద్దకులపోళ్లే వెట్టుకోవాల్నా..? దళితులు కింది వర్గాలోళ్లు వెట్టుకోవద్దా..? అట్ల వెట్టుకుంటె ఊరికేమన్న అరిష్టమైతదా..? లేకపోతె ఊరికి గత్తర దల్గుతదా..? అరే ఏం మన్షులురానాయన.. పాపం దళితులు గూడ గణపతి పండుగ జేస్కుంటె ఓరుస్తలేరంటే..? మరి దళితులు ఏం జేయాల్నో మీరే జెప్పుండ్రిగ అంబేద్కర్ విగ్రహం బెట్టుకుంటె ఓర్వరాయే.. ఆళ్ల కులవృత్తులు జేస్కుంటె ఓర్వరాయే.. ఏం కథ ఇది..?

అయ్యో పాడుగాను.. చివరి సూపు కన్న నోచుకోకపోతిమి.. ఎంతపనైపాయెనుల్లా.. శీన్మలు జూశెటోళ్లకు ఏ కష్టం రాకుంట కాపాడుతుండే.. నిన్న ఆత్మహత్య జేస్కోని సచ్చిపోయిందట.. పాపం మొగదిక్కు లేక ఆంధ్రా ఆడిబిడ్డెలు పాడె మోశిండ్రు తలగోరి వట్టిండ్రు.. డప్పుల సప్పుళ్లు లేక సైలెంటుగ పీన్గె వోతుంటే.. సూశినోళ్లంత నవ్విండ్రు.. అగో ఏడ్వాలేగని.. నవ్విండ్రేందంటరా..? సూడుండ్రి తెలుస్తది.. 

Don't Miss