వాళ్ల బత్కు ఎంత దీనంగుంటదో

20:40 - December 27, 2017

అబ్బ మొత్తం మీద సర్కారు ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముంగట దోషిగ నిలవడక తప్పలేదు సూడుండ్రి.. మంద క్రిష్ణ మాదిగనే అరెస్టు జేశి ఆరు రోజులు వట్టి జైళ్ల వెట్టిన ప్రభుత్వం.. బెయిల్ రాకుంట శాతనైన కాడికి బాగనే తన్లాడింది.. కని ఎట్టకేలకు బెయిల్ మంజూరై బైటికొచ్చిండు.. ఇగ మరి సర్కారు మీదికి యుద్దానికి తయ్యారైతున్నడా..? కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జెప్పవోతున్నడనేది సూద్దాం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అవద్దాలు జెప్తున్నడట.. మశివూశి మారెడు గాయ జేశి.. ఇగో ఇదే చందమామా అని చెప్కతిర్గుతున్నడట.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాగనే సొట్ల వెట్టిండు.. అవద్దాల మీదనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది.. ఈ ప్రభుత్వం ఉండుడు ప్రజాస్వామ్య దేశంల మంచిదిగాదన్కొచ్చిండు..

దొంగది గాదు దొడ్లకు రాదన్నట్టు.. ఆ బట్టెవాయి మాటలు ఎందుకు మాట్లాడాలే మళ్ల ఎందుకు మత్పరియ్యాలే జనగామా ఎమ్మెల్యేగారూ..? విద్యల రిజర్వేషన్లు తీశేయాలని కుద్దుగ అంటివి మళ్ల.. డ్యాష్ కథలు వడవడ్తివి నేను అట్ల అనలేదు.. చేయలేదని.. ఒక్కదినంలనే మాటమార్చెటోనివి నువ్వు ఎమ్మెల్యే పదవి శిగ్గుదీస్తున్నవ్ గదా..? ప్రజలారా సూడుండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతం..

గురిగింజ నల్పెర్గదన్నట్టు.. తెల్గుదేశమోళ్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల తప్పులు ఏరుకుంట తమాష జేస్తున్నరు.. ఈ భూమ్మీద తెల్గుదేశం పార్టీ లీడర్లు మాత్రమే ఆణిముత్యాలు తతిమోళ్లంత దగాకోర్లు, కబ్జాకోర్లు.. కూనికోర్లు అన్నట్టు ముచ్చట జెప్తున్నది అనురాధా మేడం.. ఆ కథ ఏందో జర మీరు గూడ ఇనాలే.. మళ్ల మనం గూడ అనాలే..

పదికిలోల బాటు మీదికి ఇశిరేశి.. బుజానికి తాకిచ్చుకుంటరా..? బొక్కలు సూర సూర అయితయ్.. టీవీలళ్ల అప్పుడప్పుడు వస్తుంటయ్ సూడుండ్రి వాళ్లు టీవీలళ్ల కండలు తిర్గి.. గుండె ధైర్యం తోని జేశే సాహసాలు మాత్రమే జూశ్నంమనంగని.. వాళ్ల బత్కు ఎంత దీనంగుంటదో సూడలే.. అందరికి ఆనందం పంచే ఆ సాహసవీరులు.. ఊర్లె మాత్రం ఎక్కిరింతల పాలైతున్నరు..

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అయ్యిందని తెల్వంగనే ఎంటనే తన పార్టీ మన్షితోని నామినేషన్ ఏపిచ్చి.. భర్తీ జేయవోతున్నడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరి ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ జేస్కునెకాడున్న ఆత్రం.. సర్కారు దావఖాండ్లళ్ల డాక్టర్లను భర్తీ జేసెకాడ ఎందుకు లేదు..? చంద్రాలు ఇగో జనం గోసజూడు..

 

Don't Miss