సమస్యల సుడిగుండంలో తెలంగాణ యూనివర్సిటీ

19:11 - January 3, 2017

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల కొరతతో అల్లాడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యూనివర్సిటీకి మహార్దశ వస్తుందని భావించిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హమీ నీటిపై రాతగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
రూసా నిదులకు నోచుకోని యూనివర్సిటీ
తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు వచ్చి ఏడాది గడిచినా.. విశ్వవిద్యాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. న్యాక్ గుర్తింపు లేని కారణంగా యూనివర్సిటీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రీయ ఉచ్చతర్‌ అభియాన్ రూసా నిదులకు నోచుకోలేదు. 2016 జనవరిలో యూనివర్సిటీకి న్యాక్ బీ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత న్యాక్‌ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఖ్యాతి గడిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా..నేటికీ రూసా నుంచి తెలంగాణ యూనివర్సిటీకి నయా పైసా రాలేదు. 
నిధులు రాబట్టడటం ప్రశ్నార్థకంగా 
2015 అక్టోబర్‌ నెలలో 50 కోట్ల రూసా నిధులకు డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా ఫలితం లేకుండా పోయింది. న్యాక్ గుర్తింపు వచ్చిన తరువాత గతేడాది మార్చిలో 20 కోట్ల రూసా నిదులకు రెండోసారి ప్రతిపాదనలు పంపినా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. రూసా సెమినారు నిర్వహించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కేవలం లక్ష రూపాయలు మంజూరు చేసినా..వాటినీ తెచ్చిన దాఖలాలు లేవు. దీంతో రాష్ర్టీయ ఉచ్చతర్‌ అభియాన్ నిధులు రాబట్టడటం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో నిదులు సమకూర్చుకొవటం విశ్వవిద్యాలయం అధికారులకు సవాల్‌గా మారింది. రూసా నిదులు వస్తాయన్న ఆశతో అప్పటి రిజిస్ట్రార్ వైస్ చాన్సలర్ బిక్కనూర్ నూతన కాలేజీ భవనానికి భూమి పూజా చేసారు.. నిధుల లేమితో ఈ పనులు అటకెక్కాయి. న్యాక్ గుర్తింపు ఉంటే రూసా నుంచి సుమారు 20 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  ఈ నిధులు వస్తే క్యాంపస్‌లో కళాశాల భవనాలు,ప్రయోగశాలలు, ఆడిటోరియం, ఆరోగ్య  కేంద్రాల పనులు కార్యరూపం దాల్చుతాయని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రూసా నిధులు రాబట్టడంలో విశ్వ అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. రూసా నిధులకు కేవలం ప్రతిపాదనలు పంపడంతో సరిపోదని..జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో కేంద్ర మానవ వనరుల శాఖపై ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

 

Don't Miss