మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

07:42 - January 30, 2018

మహబూబ్ నగర్ : -మన్యం కొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం పలు రాష్ర్టాల నుంచి తిరుమలకు వెళ్ళే స్థోమత లేని పేదలు... మన్యంకొండలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని... మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ఈ కొండ పేదల తిరుపతిగా పేరుగాంచింది.ఎత్తైన కొండపై గుహల్లో స్వయంభూగా వెలిసిన స్వామికి ఏడాదికి ఓసారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 15రోజుల పాటు సాగే ఉత్సవాల్సో భక్తులు లక్షలాదిగా పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కొండపైకి చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని నిర్మించారు. 24 గంటల పాటు విద్యుత్ సౌకర్యం, తాగు నీటికోసం కుళాయిలు, క్యూ లైన్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆళహరి వంశీయులు స్వామివారికి సేవలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ నెల 31న రథోత్సవం, గరుడ సేవ నిర్వహిస్తారు. నిండు పున్నమినాడు జరిగే రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. మొక్కులు తీర్చుకునేందుకు దసాంగాలను సమర్పిస్తారు. మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగానూ ప్రసిద్ధి చెందారు.. ఆయన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. స్వామి వారి దివ్యరూపాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంతో తరిస్తున్నారు.

Don't Miss