ఆగ్రహించిన రైతన్న..

22:01 - April 27, 2018

సూర్యాపేట : మర్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. మద్దతుధర దొరకడం లేదంటూ మార్కెట్‌యార్డ్‌ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విజయవాడ జాతీయ రాహదారిపై రాస్తారోకో చేపట్టారు. మద్దతు ధర ఇస్తామన్న జాయింట్‌ కలెక్టర్‌ మాట అమలు కాలేదని రైతులు ఆరోపించారు.

సూర్యాపేట మార్కెట్‌ యార్డ్‌ ఉద్రిక్తం..
అన్నదాతల ఆవేశంతో సూర్యాపేట మార్కెట్‌ యార్డ్‌ ఉద్రిక్తంగా మారింది. తమ పంటలకు సరైన ధర చెల్లించాలంటూ రైతులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం నాడు, జాతీయ రహదారి 65 రహదారిపై బస్తాలను వేసి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

కలెక్టర్‌ సంజీవ రెడ్డి, మాట తప్పాడన్న రైతన్నలు
తమ పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజీవ రెడ్డి, మాట తప్పాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 1400 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే సూర్యాపేట మార్కెట్‌లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు.

నిరసనగా అన్నదాతలు రాస్తారోకో
గురువారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో లక్ష బస్తాల ధాన్యం వచ్చింది. దీంతో ట్రేడర్‌లు ఉద్దేశపూర్వకంగానే ధాన్యం ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిరసనగా అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు.. అయినా ట్రేడర్‌ల నుంచి ఎటువంటి సహకారం రాకపోవడంతో మార్కెట్‌ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

రైతు సమస్యలను పరిష్కారించాలని డిమాండ్
మరో పక్క వరంగల్ జిల్లా సంగెం మండలం తిగరాజులపల్లి గ్రామ రైతులు వరి, మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అధికారులు ఎంతో ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పోతున్నారు తప్ప ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుతున్న ప్రభుత్వం ఇకనైన రైతు సమస్యలను పరిష్కారించాలని స్థానికి నేతలు డిమాండ్ చేశారు. 

Don't Miss