ఇక ఈ వానాకాలం చుక్కలే...

21:12 - May 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదారాబాద్‌లో గాలి వాన బీభత్సం సృష్టించింది. హోరు గాలి.. జోరు వానతో నగరం తడిసి ముద్దైంది. సుమారు అరగంటపాటు కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి జీహెచ్ఎంసీతోపాటు పలు కార్యాలయాల్లోని ఫైళ్ళు తడిసిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో చెట్లు, విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కమ్ముకున్న మేఘాలు ఒక్కసారిగా కుండ‌పోత వ‌ర్షాన్ని కురిపించాయి. నగరం అంతా మ‌బ్బులతో చీక‌టి మ‌యం అయింది. విపరీతమైన గాలి వానకు ప్రజలు బెంబేలెత్తారు. గాలి వానకు పలు చోట్ల భారీ చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది.

గాలి వానతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం క‌లిగింది. వెస్ట్ జోన్ నుంచి ఈస్ట్ జోన్ వ‌ర‌కు తీవ్రమైన గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. అంబ‌ర్ పేట‌లో ఐదు సెంటి మీట‌ర్లు, హిమాయ‌త్ న‌గ‌ర్, నాంప‌ల్లి, ఖైర‌తాబాద్‌ల‌లో నాలుగు సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మ‌ల్కాజ్ గిరి, గోల్కొండ‌లో మూడు సెంటిమీట‌ర్లకు పైగా వ‌ర్షపాతం న‌మోదైంది. సుమారు అర్దగంట‌ పాటు కురిసిన వానకు... ఐదు సెంటి మీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.

నాగ‌మ‌య్య కుంట.. అంజ‌నేయ స్వామి టెంపుల్ వ‌ద్ద వందేళ్ల నాటి భారీ రావి వృక్షం విరిగిపడి..నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. జీహెచ్ఎంసీ, స‌చివాల‌యం, ఐ ఆండ్ పీఆర్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న చెట్లు కూలి.. వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. విపరీతంగా వీచిన గాలికి జిహెచ్ఎంసీతోపాటు ప‌లు కార్యాల‌యాల్లో అద్దాలు పగిలిపోయాయి. వర్షానికి ఫైళ్ళు తడిసిపోయాయి. సైబర్ సిటీ, హబ్సి గూడా, మేడ్చల్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ జోన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వానకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, బల్దియా మాన్ సూన్ రిస్క్యూ టీమ్‌లను రంగంలోకి దింపారు.

Don't Miss