తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

13:45 - July 11, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. నాలుగు రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో మూడు, నాలుగు రోజులుగా చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
    
ఐదు రోజులుగా మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పెనుగంగాలో వరద ప్రవాహం పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొమురంభీం, చెన్నూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు రాకపోకలు స్థంభించాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పెనుగంగా, గోదావరి నదులు కలిసే కాళేశ్వరం వద్ద వరద ఉధృతి 7.5 మీటర్లకు చేరుకుంది. వర్షం ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం బ్యారేజీ పనులు నిలిచిపోగా... కన్నెంపల్లి పంప్‌ హౌజ్‌ పనుల్లో వేగం తగ్గింది. అన్నారం బ్యారేజి వద్ద వరద నీటిని ఆపేందుకు నిర్మించిన తాత్కాలిక కట్ట తెగిపోవడంతో ఈరోజు 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగి గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 16 అడుగులు ఉన్న గోదావరి నీరు 26 అడుగులకు చేరింది. గోదావరికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో నిర్మాణంలో ఉన్న రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వరద నీరు క్రమంగా స్నానాల ఘట్టాల వరకు చేరుకోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. 

భద్రాద్రి జిల్లా జూలూరుపాడ్‌ మండలం పాపకొల్లు పంచాయితీ వెనకతండా గ్రామంలో రహదారులు చిత్తడిగా మారాయి. జూలూరుపాడు మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్లు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర పనులకోసం మండలానికి వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న రహదారికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రహదారికి అడ్డంగా కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవరకు కంచె తీసేదిలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్లలో వర్షం జోరుగా కురుస్తోంది. వర్షాలతో కోనసీమలో పొలాలు ముంపు బారిన పడ్డాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు  ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Don't Miss