శ్రీ చినశేష, హంస వాహనాల పరమార్థం..

12:03 - October 11, 2018

తిరుమల :  నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ రోజు  చిన్న శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేడు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మాడ వీధులకు పోటెత్తడంతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు వెలవెలబోయాయి. కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే మూల విరాట్టును దర్శించుకునేందుకు భక్తులు వేచివున్నారు. వీరికి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. కాగా, నేటి సాయంత్రం హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
కలియుగ దైవం శ్రీ శ్రీనివాసును బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. రెండో రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మిగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పాలను, నీళ్లను వేరుచేసినట్టుగానే.. దేవుడి ఆదేశాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతనవైపు జీవితాన్ని మరల్చుకోవాలన్నది హంసవాహన సారాంశం. 
 

Don't Miss