జనం చెంతకు..కన్నెపల్లి జాబిల్లి...

07:10 - February 1, 2018

మహబూబాబాద్ : రెండేండ్ల ఎదురు చూపుల తర్వాత మేడారంలో వన దేవతల సంబురాలు మిన్నంటాయి. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. కన్నెపల్లి నుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో మహాజాతరలో తొలిఘట్టం పూర్తయ్యింది. ఇక పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి దగ్గర సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబూరంలో మునిగిపోయింది. ఇక తల్లి సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి స్వాగతించేందుకు మేడారం ఒళ్లంతా కండ్లుగా ఎదురుచూస్తున్నది.

మేడారం జనసంద్రమైంది. వనదేవతల దర్శనానికి జన ప్రవాహం తరలివచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తకోటి... సారక్క రాకతో పులకించింది. తల్లీ సారక్క నీవే దిక్కంటూ నలుదిక్కులు పిక్కటిల్లేలా జాతరకొచ్చిన జనం.. దాడిపొడవునా పొర్లుదండాలు పెడుతూ ప్రణమిల్లారు. తెలంగాణ కుంభమేళా... మేడారం మహాజాతరలో తొలిఘట్టం సారక్కరాకతో ముగిసింది.

తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి సారక్క కోసం భక్తజనం భారీగా తరలివచ్చారు. సారక్కను తోడ్కొని వచ్చే ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సమయానికిఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ కోయ గిరిజనుల పూజా విన్యాసాలతో కన్నెపల్లి మార్మోగింది. పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఆనవాయితీ ప్రకారం కన్నెపల్లి నుంచి 16మంది ఆడబిడ్డలు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం డోలీ విన్యాసాలతో మేడారం వచ్చారు. తల్లీబిడ్డలైన సమ్మక్క - సార్కలు కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు.

ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా సారక్క మేడారం పయనం ఈసారి చాలా ఆలస్యమైంది. రాత్రి 8.12 గంటలకు కన్నెపల్లి గుడి నుంచి సారక్క మేడారం బయల్దేరింది. 8.45 గంటలకు కన్నెపల్లి వాడవాడలా సారక్కకు మంగళహారతులు పట్టారు. 9.20కి కన్నెపల్లి ఊరు సారక్కను సాగనంపింది. 9.35 గంటలకు సారక్క జంపన్నవాగుకు చేరుకుంది. 9.40గంటలకు వాగునుంచి బయటికి వచ్చిన సారక్కకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మొక్కులు చెల్లించుకున్నారు. 10.05 గంటలకు మేడారం గుడికి సారక్క చేరుకుంది.

సారక్క మేడారానికి బయల్దేరిందన్న సమాచారం తెలియగానే మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడినుంచి బయటికి రాగానే సారక్క కన్నెపల్లి వాడవాడ తిరుగుతూ తన బిడ్డలకు దీవెనలిచ్చింది. ఇల్లిల్లు సారక్కకు చీరెసారె పోసి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అత్యంత నియమనిష్టలతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ప్రధాన వడ్డె సారయ్య ఆధ్వర్యంలో సారక్క మేడారం గద్దెకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున దారికిరువైపులా జన సందోహం పోటెత్తింది. సిగాలూగె సివసత్తుల పూనకాలతో జాతర మారుమోగింది. ఎదుర్కోళ్లు సమర్పిస్తూ ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారక్కకు నీరాజనం పలికారు.

మేడారం పొలిమేరల్లోకి సారక్క రాగానే సంబూర వాతావరణం వెల్లవిరిసింది. అప్పటికే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చారు. ఆ ఇద్దరూ సారక్కకోసం ఎదురు చూస్తున్న తరుణంలో మేడారానికి సారక్క వచ్చిందన్న సంకేతంతో గుడి ప్రాంగణం సందడిగా తయారైంది. సారక్క మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలీ మోతలు, కొమ్ము బూరల నాదాలు దద్దరిల్లాయి. ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మేడారం గద్దెల ప్రాంగణానికి బయలుదేరారు. రాత్రి 12.22 గంటలకు సారక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజు వారివారి గద్దెలపై ఆసీనులయ్యారు.

ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గుట్టదిగి వచ్చి భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెపై రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో ప్రతిష్ఠించనున్నారు. పూజారులు చాలా జాగ్రత్తగా తల్లిని తీసుకొని ప్రధాన ద్వారం గుండా గద్దెపైకి చేరుకొని ప్రతిష్ఠిస్తారు. ఈసారి మేడారం జాతరకు జనం పోటెత్తారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో దాదాపు 12 గంటలకుపైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.  

Don't Miss