మీటూ తర్వాత వింత ప్రవర్తనలు : మాట్లాడరు.. కనిపిస్తే పారిపోతారు

15:25 - December 4, 2018

ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమంతో గళమెత్తిన మహిళల గొంతులను నొక్కివేసే యత్నాలు జరుగుతున్నాయా? మహిళల ఆర్థిక స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా వున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. న్యూయార్స్ వాల్ స్ట్రీట్ లో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.

ఇలా ప్రవర్తిస్తున్నారు :
మహిళా ఉద్యోగులతో డిన్నర్ కు వెళ్లవద్దు..
విమానాలు ఎక్కితే మహిళల పక్కన కూర్చోవద్దు..
హోటల్స్ లో దిగాల్సి వస్తే ఒకే ఫ్లోర్ లో ఉండవద్దు..

వాల్ స్ట్రీట్ లోని పురుషులంతా.. 'మీటూ' ఉద్యమం తర్వాత ఇలా ప్రవర్తిస్తున్నారు. వ్యూహాత్మకంగా..కుటిలబుద్ధితో  తీసుకుంటున్న నిర్ణయాలు మహిళలను సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి మహిళలు అందరూ కూడా బాధపడుతున్నారు.

ఆఫీసుల్లో మహిళలతో మాట్లాడేవారే తగ్గిపోయారు. ఎక్కడ తమపై ఆరోపణలు వస్తాయన్న భయం కన్నా, ఈ 'మీటూ'ను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశమే ఈ వ్యూహాల్లో ఉద్ధేశంగా కనిపిస్తోంది. దీనికి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్సీ మాట్లాడిన మాటలే నిదర్శనం. మహిళలతో డిన్నర్ కు వెళ్లడం మానేశానని ఆయన స్వయంగా చేసిన ప్రకటన సంచలనం అయ్యింది. 

'మీటూ' ఉద్యమంపై పురుషుల స్పందన ఎలావుందో తెలుసుకోవాలని 30 మంది వాల్ స్ట్రీట్ సీనియర్ ఉద్యోగులను ప్రశ్నించగా, ప్రతి ఒక్కరూ మహిళలను దూరం పెట్టాలన్న నిర్ణయంతోనే ఉన్నట్లుగా తెలిసిందని మైక్ పెన్సీ తెలిపారు. ఉద్యోగపరంగా చనువుగా ఉన్నా.. తమపై ఆరోపణలు చేస్తారోమో అన్న ఆందోళన పురుష ఉద్యోగుల్లో వ్యక్తం కావటం విశేషం. 

మోర్గాన్ స్టాన్లీ మాజీ ఎండీ డేవిడ్ భన్ మాట్లాడుతూ పురుషులంతా ఆఫీసుల్లో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ప్రకటించేశారు. తమను తాము కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. 

మహిళల్లో మానసిక ఆందోళన :

కొలీగ్స్ తోపాటు ఇతరులు కూడా ఇలాంటి వైఖరి అవలంభించటం వల్ల మనశ్శాంతి కోల్పోతున్నామని ఉద్యోగినులు చెబుతున్నారు. స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నామని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నవ్వటానికి కూడా అవకాశం లేకుండాపోయిందని.. జోక్ కూడా చేయటం లేదని.. కనిపిస్తే దూరంగా వెళ్లిపోతున్నారని.. కలిసి కాఫీ తాగటం లేదు.. కలిసి భోజనం చేయటం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మానసికంగా దెబ్బతీస్తున్నారని పురుష ఉద్యొోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss