మనసు లేని మంత్రి.. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా...

19:51 - December 20, 2016

భూపాలపల్లి : ప్రాణాపాయంలో ఉన్న  జంతువునో.. పక్షినో చూస్తే.. మనలో చాలామంది విలవిల్లాడిపోతారు. ఆ జీవి ప్రాణాలు నిలపడానికి ప్రయత్నిస్తాం. కానీ.. కళ్లముందే ఓ యువకుడు నెత్తుడిమడుగులో కొట్టుకుంటున్నా ఆ ప్రజాప్రతినిధికి కనికరం లేకుండా పోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాన్ని కళ్లారా చూసిన మంత్రి చందూలాల్‌ కనీసం కారుదిగకుండా వెళ్లిపోవడంపై  ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  
మంత్రి తీరుపై విమర్శలు 
అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా.. ఆపక్కనే కారులో చూసీ చూడనట్లుగా వెళ్లిపోయారు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌. ప్రజాపత్రినిధిగా కాకున్నా..  ఓ మనిషిగా కూడా స్పందించని మంత్రిగారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లకాలువ క్రాస్‌రోడ్‌లో రోడ్డు ప్రమాదం 
జయశంకర్‌ భూపాలపల్లిజిల్లా పాలంపేటదగ్గరలోని నల్లకాలువ క్రాస్‌రోడ్‌లో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలంపేటలోని రామప్ప టెంపుల్‌కు  తన ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్లి వస్తున్న మధుసూదనాచారి ఇలా రోడ్డుప్రమాదానికి గురైయ్యాడు. బైక్‌పై వెళ్లుతున్న వారిని ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ వాహనం ఢీకొట్టడంతో.. మధుసూదనాచారి అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో మంత్రి అజ్మీరా చందూలాల్‌ కాన్వాయి అక్కడికి చేరుకుంది. మంత్రిగారు  వచ్చారు కదా.. బాధితులకు తక్షణ సహాయం అందుతుంది అనుకున్న స్థానికులకు ఆవేదనే మిగిలింది. కనీసం కారు ఆపకుండా  వెళ్లిపోతున్న మంత్రిగారి తీరును ఓ యువకుడు ఇలా తన సెల్‌ఫోన్‌ కెమెరాతో క్లిక్‌ మనిపించి.. సోషల్‌ మీడియాలో పెట్టేశాడు.
ఘటనపై స్పందించిన మంత్రి చందూలాల్‌
ఇదే విషయంపై మంత్రిగారు స్పందించిన తీరు మరింత విస్మయం గొలుపుతోంది.  నిజానికి తాను కారు ఆపి బాధితులకు సహాయం చేయాల్సి ఉందని.. కానీ.. తన బంధువొకరు ప్రాణాపాయంలో ఉన్నారని ఫోన్‌ రావడంతోనే తాను ఈ ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని మంత్రి గారు వివరణ ఇచ్చారు. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి..ప్రాణం ఎవరిదైనా విలువైనదేకదా..! మంత్రిగారు తన బంధువుకోసం ఆతృత పడటం సహజమే..! అయినా.. కళ్లముందు ప్రాణంకోసం విలవిల్లాడుతున్న వ్యక్తిని పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 

 

Don't Miss