డిజిటల్ సిద్ధిపేట..

21:31 - January 1, 2017

సిద్ధిపేట : నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 100శాతం నగదు రహిత లావాదేవీల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సిద్ధిపేటలో మహిళా సంఘాలకు ఉచితంగా మినీ ఏటీఎంలు పంపిణీ చేశారు. అంతకుముందు సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో హ్యాక్‌ఐ యాప్‌ను ప్రారంభించారు.

సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల్లో...
నగదు రహిత లావాదేవీల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సిద్ధిపేట నియోజకవర్గంలో అడుగులు పడుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఇందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ను దేశంలోనే తొలి నగదురహిత గ్రామంగా నిలిపారు. అంతేకాదు.. మిషన్‌ భగీరథ, స్వచ్ఛ సిద్ధిపేట, హరితహారం లాంటి కార్యక్రమాల్లో సిద్దిపేట నియోజకవర్గం ముందుంది. అలాగే నియోజకవర్గంలో వందశాతం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు.

50 సంఘాలకు మినీ ఏటీఎంల పంపిణీ
సిద్ధిపేటలోని శివమ్స్‌ గార్డెన్‌లో 50 మహిళా సంఘాలకు మంత్రి హరీశ్‌రావు మినీ ఏటీఎంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణలో సిద్ధిపేట నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హరీశ్‌రావు అన్నారు. నగదు రహిత సేవల కోసం ప్రతి గ్రామానికి ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీల దిశగా ప్రజలంతా ముందడుగు వేయాలని కోరారు. మహిళా గ్రూపుల్లో జరిగే లావాదేవీల్లో 50శాతం డిజిటల్‌ పద్ధతిలో నిర్వహిస్తే ఏటీఎంల చార్జీలను తానే భరిస్తానని హామీనిచ్చారు.

మోదీ ప్రసంగం నన్ను నిరాశ పర్చింది: హరీశ్‌
శనివారం నాటి మోదీ ప్రసంగం తనను నిరాశపర్చిందని హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఏమైనా లబ్ది చేకూరే ప్రకటనలు ఉంటాయని తాను ఆశించానని.. కానీ అవేమీ ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మోదీ 50 రోజలు గడువు కోరారని.. నేటికీ సమస్యలు మాత్రం తీరలేదన్నారు. అంతకుముందు సిద్దిపేట కమిషనరేట్‌ హాక్‌ఐ యాప్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్నవారికి తక్షణ పోలీస్‌ సేవలు అందించనున్నట్టు చెప్పారు. 

Don't Miss