ప్రతి ఇంటికి తాగునీరందిస్తాం : మంత్రి హరీష్ రావు

07:32 - June 14, 2018

సంగారెడ్డి : మిషన్‌ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మిషన్‌ భగీరథ రిజర్వాయర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.  
39 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం 
సంగారెడ్డి జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. రామచంద్రాపురం, పఠాన్‌చెరు, బొల్లారం ప్రాంతాల్లో దాదాపు 39 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
రూ.2 కోట్లతో చేపట్టిన 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి
రామచంద్రాపురం కొల్లూరులో సుమారు 2 కోట్లతో చేపట్టిన 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 2.75 కోట్లతో చేపట్టిన సర్వీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణారెడ్డిపేటలో 2.75  కోట్లతో చేపట్టిన సబ్‌ స్టేషన్‌ ప్రారంభించారు. జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరథ రిజర్వాయర్‌తో పాటు బొల్లారంలో 18 కోట్లతో చేపట్టిన సర్వీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణలో 60 ఏళ్లుగా మంచినీటి కోసం బాధ పడ్డామని... మిషన్‌ భగీరథతో ఆ బాధ తీరిపోతుందన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరందిస్తామన్నారు.  
విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ : హరీష్ రావు 
విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా నిలిచిందన్నారు మంత్రి హరీశ్‌రావు. ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తోందని తెలిపారు. వచ్చే నెల నుండి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు.

 

Don't Miss