ధాన్యం సేకరణపై ప్రతిరోజు సమీక్ష...

07:33 - April 21, 2017

హైదరాబాద్ : ధాన్యం సేకరణను ఇకపై ప్రతిరోజు సమీక్షించాలని మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన హరీష్‌రావు... ధాన్యం క్రయ, విక్రయాలపై మీడియాలో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని.. తేమ శాతం 17లోపు ఉండేలా రైతులలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐకేపీల ద్వారా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయొచ్చని.. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని హరీష్‌రావు సూచించారు.
ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు..
వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు హరీష్‌రావు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్ల తర్వాత రైతులకు చెల్లింపులు 48 గంటల్లోనే జరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు, క్రయ విక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలన్నారు. ఏ రోజుకారోజు మార్కెట్‌ నుంచి ధాన్యం మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైతే రవాణాశాఖను సంప్రదించి లారీల కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు. 

Don't Miss