కాలుష్యాన్ని తరలిస్తాం..

21:31 - July 9, 2018

హైదరాబాద్ : జంట నగరాల్లోని కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, భునగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 ప్రాంతాలకు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తామని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

పాశమైలారంలో కేటీఆర్ పర్యటన
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలుష్యకారక పరిశ్రమల తరలింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు గుర్తింపు
జంట నగరాల్లో భారీగా కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించారు. వీటి తరలింపునకు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తైంది. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు గుర్తించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించిన తర్వాత ఈ కార్యక్రమం చేపడతారు. మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నట్టు లెక్కతేలింది. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూగర్భజలాలతోపాటు పర్యావరాణానికి తీవ్ర ముప్పువాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ఒక్కటే మార్గమని నిర్ణయించింది. వీటిలో ఎక్కువ భాగం ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొత్తం 283 కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలను రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీకి తరలిస్తారు.

కాలుష్య పరిశమ్రలను తరలించేందుకు 17 ప్రాంతాలకు గుర్తించాం -కేటీఆర్‌
కాలుష్యకారక పరిశ్రమలను అవసరమైనే మూసివేయడానికి కూడా వెనుకాడబోమని కేటీఆర్‌ హెచ్చరించారు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు 17 ప్రాంతాలను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ... ఈపీటీఆర్‌ఐ.. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల ఈ ప్రాంతాలను గుర్తించింది. కాలుష్యకోరల నుంచి ప్రజలను రక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నకేటీఆర్‌.. పరిశ్రమల తరలింపునకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. 

Don't Miss