ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌

07:48 - May 2, 2018

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని రెండు నెలల్లో ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని నాగోల్‌ మార్గంతో కలిపేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. అలాగే ఎల్బీనగర్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తామని చింతల్‌కుంట అండర్‌పాస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 
చింతలకుంట చౌరస్తా వద్ద అండర్‌పాస్‌ ప్రారంభం 
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్‌ చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మొత్తం 18.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అందుబాటులోకి వచ్చిన  మూడో ప్రాజెక్టు ఇది. అండర్‌ పాస్‌ గోడలను ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిద్దిద్దారు. 
మియాపూర్‌ ఎల్బీనగర్‌ మార్గంలో ఎస్‌ఆర్‌నగర్‌ వరకు మెట్రో రైళ్లు 
ఈ సందర్భంగా కేటీఆర్‌... మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గంలో ఇప్పుడు ఎస్‌ఆర్‌నగర్‌ వరకు రైళ్లు నడుస్తున్నాయి. రెండు నెలల్లో ఎస్‌ఆర్‌ నగర్‌-ఎల్బీ నగర్‌ వరకు కూడా మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అప్పుడు మియాపూర్‌-ఎల్బీ నగర్‌ మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని నుంచి నాగోల్‌ మార్గంలో అనుసంధానం చేస్తారు. ఎల్బీ నగర్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టును పొడిగిస్తామని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. 
ఎల్బీనగర్‌ పరిధిలో రూ.450 కోట్లతో ఎఆర్‌డీపీ పనులు 
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా మూడు వేల కోట్ల రూపాయలతో జంట నగరాల్లో చేపడుతున్న పనులను కేటీఆర్‌ వివరించారు. ఈ మొత్తంలో 450 కోట్ల రూపాయలతో ఎల్బీనగర్‌లోనే పనులు చేపడుతున్నారు. ఎల్బీనగర్‌ ఎడమ వైపు చేపట్టిన అండర్‌పాస్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని ప్రతిపాదించారు. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తారు. ఎల్బీనగర్‌లో చేపట్టిన పనులన్నీ 2019 జూన్‌ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. నల్గొండ క్రాస్‌ రోడ్స్‌ నుంచి ఒవైసీ ఆస్పత్రి వరకు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తారు. నగరాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు.  
చెరువుల సుందరీకరణకు రూ.541 కోట్ల ఖర్చు 
మూసీనది సుందరీకరణలో భాగంగా మూసీపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు  లభించగానే ఈ ప్రాజెక్టు చేపడతారు. జంటనగరాల్లో ఉన్న 185 చెరువుల్లో మొదటి దశలో 40 చెరువులను సుందరీకరిస్తారు. ఇందుకు 541 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మరోవైపు అవుట్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంగా భాగంగా పూర్తి చేసుకొన్న కండ్లకోయ జంక్షన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతో 158 కి.మీ. అవుట్‌ రింగ్‌ రోడ్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఈ రెండు కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

 

Don't Miss