నేను చెప్పినా లెక్క లేదా? అయితే వెళ్లిపొండి..

21:42 - June 12, 2018

హైద‌రాబాద్‌ : పనులు జ‌రుగుతున్న తీరుపై మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను ఇష్టానుసారంగా త‌వ్వేస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకోవ‌డం లేదని మండిపడ్డారు. నాలాల పూడిక‌తీత‌లో పురోగతి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై సమీక్షించిన మంత్రి..

ఇష్టం లేని అధికారులు సెలవుపై వెళ్లిపోవాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

జీహెచ్ఎంసి అధికారుల‌పై మండిప‌డ్డ మంత్రి కేటీఆర్‌
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వ‌ర్షాకాలం ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామ‌ని అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధమైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వర్షాకాలంలో నగర పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ‌ర్షాకాలంలో చేయాల్సిన ప‌నులు ఇప్పటికీ పూర్తి చేయ‌క‌పోవ‌డంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నాలాల పూడిక‌తీత ప‌నులు ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. గ‌త ఏడాది వ‌రద‌ల కార‌ణంగా వ‌చ్చిన ఇబ్బందుల‌ను ఇప్పటికీ ప‌రిష్కరించ‌క‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. ఇష్టం లేని అధికారులు, సిబ్బంది శెల‌వుపై వెళ్ళాల‌ని హెచ్చరించారు.

త‌వ్వకాలు ఎందుకు జ‌రుగుతున్నాయని ప్రశ్నించిన కేటీఆర్‌
మరోవైపు న‌గ‌రంలో రోడ్ల త‌వ్వకాలు ఎందుకు జ‌రుగుతున్నాయంటూ అధికారుల‌ను నిల‌దీశారు కేటిఆర్. న‌గ‌రంలోని రోడ్ల త‌వ్వకాల‌కు సంబంధించి వ‌స్తున్న ఫిర్యాదుల‌కు స‌మాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంద‌న్నారు మంత్రి. ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా రోడ్ల ప‌రిస్థితి మాత్రం మార‌డం లేదని,... గుంత‌లు ఎందుకు ఉన్నాయంటూ అధికారుల‌ను ప్రశ్నించారు. వ‌ర్షాకాలం నేప‌థ్యంలో పురాత‌న నిర్మాణాల విష‌యంలో జాగ్రత్త వ‌హించాల‌ని.. పురాత‌న‌ భ‌వ‌నాల‌ను త‌క్షణ‌మే కూల్చివేయాల‌ని టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు కేటీఆర్‌ ఆదేశించారు.

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన కేటీఆర్‌
ఇక నాలాల‌పై ఉన్న అక్రమ నిర్మాణాల‌ను తొల‌గించే విష‌యంలో ఎలాంటి వారినైనా వ‌దిలేది లేద‌ని కేటీఆర్‌ హెచ్చరిచారు. మరోవైపు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Don't Miss