కేసీఆర్ బిడ్డ కడ్తదా ఈ చీరలు..

19:39 - September 18, 2017

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదమైంది. పండక్కి.. చేనేత చీరలు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన ప్రభుత్వం.. సూరత్‌, షోలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన పాలియెస్టర్‌ చీరలను మహిళలకు పంపిణీ చేసింది. దీంతో ఎక్కడికక్కడ మహిళాలోకం భగ్గుమంది. ఉదయం నుంచీ క్యూలైన్లలో నిలుచుని చీరలు తీసుకున్న మహిళలు.. వాటి నాణ్యతను చూడగానే ప్రభుత్వంపై శాపనార్థాలు మొదలు పెట్టారు.

పద్దెనిమిది సంవత్సరాల పైబడ్డ ప్రతి మహిళకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం.. కోటీ నాలుగు లక్షల చీరలను సిద్ధం చేసింది. సుమారు 222 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేసింది. సిరిసిల్ల నేతన్నల నుంచి 52 లక్షల చీరలు.. మిగిలిన చీరలు టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. తీరా పంపిణీ సమయంలో.. చేనేత చీరలు కాకుండా పాలియెస్టర్‌ చీరలు అందించడంతో.. కొందరు మహిళలు వాటిని అక్కడికక్కడే తగులబెట్టేశారు.

హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని శ్రీశంకర్ కాలనీలో బతుకమ్మ చీరలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకో ప్రాంతంలో ఒకో రకం చీరలు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం నుంచి పడిగాపులు కాసినా అధికారులు చీరల పంపిణీ చేయకపోవడంపై మహిళలు భగ్గుమన్నారు.

బతుకమ్మ చీరలపై నల్లగొండ జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రోడ్డుపై చీరలను కుప్పగా పారేసి నిరసన తెలిపారు.

బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత చీరలిస్తామన్న ప్రభుత్వం చివరికి నాసిరకం పాలిస్టర్ చీరలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యను విపక్షాలూ తప్పుబట్టాయి. కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆక్షేపించాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బతుకమ్మ చీరల బాగోతం బయటపడింది. నాసిరకం చీరలు అంటగడుతున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో బతుకమ్మ చీరలపై మహిళలు ధ్వజమెత్తారు. తమకి ఇచ్చిన చీరలను విసిరికొట్టారు.

వనపర్తిలో ఇదే సీన్ కనిపించింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి.. పాలిస్టర్ చీరలు ఇస్తారా అంటూ మహిళలు మండిపడ్డారు. పనులు మానుకుని వచ్చిన తమ కూలీ డబ్బులు అధికారులు ఇస్తారా అని నిలదీశారు.

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం బొద్దుగుంటలో తమకిచ్చిన చీరలు వెనక్కు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. బొంతలు కుట్టుకునేందుకు కూడా ఈ చీరలు పనికి రావని మహిళలు విమర్శించారు.

మరోవైపు చీరల పంపిణీలో ఎటువంటి గోల్ మాల్ జరగలేదన్నారు టెక్స్ టైల్ కమిషనర్ శైలజా రామయ్యర్. సూరత్‌లో తయారు చేసిన చీరలు ఇతర చీరల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ చీరల క్వాలిటీపై పూర్తి పర్యవేక్షణ జరిగిందని స్పష్టం చేశారు.

ఎంతో అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. చీరలు కాల్చిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసుల నమోదుకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో భువనగిరి, జగిత్యాల జిల్లాలో అరెస్టులు జరిగాయి. చీరలు తగలపెట్టారని... భువనగిరిలో పోలీసులు 18 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా జల్గల్ సర్పంచ్ కవిత భర్త రాజేందర్‌ను కూడా ఇదే నెపంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. పీఎస్‌ ముందు ధర్నాకు దిగారు.

Don't Miss