ప్రతి ఏకరానికి సాగునీరు అందిస్తాం : మంత్రి కేటీఆర్

07:26 - June 14, 2018

రాజన్న సిరిసిల్ల : సమగ్ర సాగునీటి విధానం, రైతుబంధు, రైతు బీమా పథకాల అమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. 
సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన 
రాజన్నసిరిసిల్ల జిల్లా సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు : కేటీఆర్ 
వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన అనంతరం సర్దార్‌పూర్‌ బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్... రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. తెలంగాణలో ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందించేందుకు సమగ్ర సాగునీటిపారుదల విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేబోతున్నామని చెప్పారు. 
ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు : పోచారం 
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ప్రతి నియోజకవర్గంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రైతు బీమా పథకంపై అన్నదాతలందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. 

 

Don't Miss