ఢిల్లీలో బిజీబిజీగా కేటీఆర్‌

09:25 - January 12, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌  కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్‌ సూచించిన విధంగా మిషన్‌ భగీరథ, కాకతీయకు 20వేల కోట్లు మంజూరు చేయాలన్నారు.  తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కేటీఆర్‌ హస్తిన పర్యటన సాగింది.  పలువురు కేంద్రమంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు.  ప్రాంతీయ విమాన అనుసంధానంపై  కేంద్ర పౌర విమానయాన శాఖతో ఒప్పందం చేసుకున్నారు.
ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎంవోయూ
తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ముగ్గురు కేంద్రమంత్రులతోపాటు నీతి ఆయోగ్‌ సీఈవో, కేంద్ర ఫైనాన్స్‌ సెక్రెటరీతో ఆయన వరుగా భేటీ అయ్యారు.  మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుతో భేటీ అయిన కేటీఆర్‌... ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్య ఒప్పందం చేసుకున్నారు.  కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు అనుమతిచ్చినందుకు  కేటీఆర్‌ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.  బేగంపేట ఎయిర్‌పోర్టును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అభివృద్ధికి ఇవ్వాలని ఆయన అశోక్‌గజపతిరాజును కోరారు. 
కేంద్రమంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ
మధ్యాహ్నం 12 గంటలకు మరో కేంద్ర మంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  సాయంత్రం కేంద్రజౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు.  తెలంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.  వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు సహకారం అందించాలని కోరినట్టు కేటీఆర్‌ చెప్పారు.  సిరిసిల్లాలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటును  రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరామన్నారు.
నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కేటీఆర్‌ భేటీ
నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌,  కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌లావసతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌ సూచించిన 20వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో విడుదలయ్యేలా చూడాలని ఫైనాన్స్‌ సెక్రెటరీని కోరారు. తెలంగాణలో తీసుకొస్తున్న నూతన ఆవిష్కరణలను నీతి ఆయోగ్‌ సీఈవోతో  కేటీఆర్‌ చర్చించారు.   

 

Don't Miss