ఖాయిలా పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక

07:21 - January 12, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రుణాలు కీలకమని భావిస్తున్న సర్కారు... బ్యాంకులను ఒప్పించ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఖాయిలా పరిశ్రమ పునరుద్ధరణ జరిగితే వేలాది మందికి ఉపాధి అవకశాలు లభిస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం 
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 
ఖాయిలా పడిన పరిశ్రమ పునరుద్ధరణపై సమీక్ష 
ఎస్‌ఎల్‌బీసీలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఖాయిలా పడిన పరిశ్రమ పునరుద్ధరణపై సమీక్షించారు. ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ అవకాశాలు ఉన్నా పెట్టుబడిలేకపోవడంతో పరిశ్రమలు మూతపడిన విషయాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావించారు. జిల్లా పరిశ్రమల కేంద్రాలతో కలిసి వీటి పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ బ్యాంకర్లకు సూచించారు.
ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ఏర్పాటు 
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్‌  బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. దీనిని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా ఆర్‌బీఐ గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంస్థలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని కేటీఆర్‌ కోరారు. ముద్రా లోన్ల పంపిణీ, ఆహారశుద్ధి, తోలు ఉత్పత్తులు తయారీ పరిశ్రమల ఏర్పాటుకు రుణాల మంజూరు, రుణాల పంపిణీలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో సమీక్షించారు. 
 

 

Don't Miss