ఇది మన మెట్రో - కేటీఆర్..

12:15 - November 25, 2017

హైదరాబాద్ : మెట్రో రైలును ఎంతో శుభ్రతగా ఉండే విధంగా ప్రజలు చూడాలని, ఇందుకు అందరూ సహకరించాలని సూచించారు. 28వ తేదీన మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్టుగూడ నుండి నాగోల్ వరకు మెట్రో రైలులో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అహోరాత్రులు పనిచేయడం మూలంగానే మెట్రో రైలు ఈ దశకు వచ్చిందని, మెట్రో రైలుకు రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయన్నారు. పూర్తిస్థాయి సన్నద్దతో మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 57 రైళ్లు వచ్చి ఉన్నాయని, ప్రారంభ దశలో మూడు కోచ్ లు ఉంటాయని..ఒక్కో కోచ్ లో 300మంది ప్రజలు ప్రయాణించే సౌకర్యం ఉంటుందన్నారు.

మెట్రో ఛార్జీలపై ఎల్ అండ్ టి వారు ప్రకటన చేస్తారని, ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగిందని అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దని రవాణాపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఆర్టీసీ నష్టాల నుండి గట్టెక్కించడానికి జీహెచ్ఎంసీ నుండి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రైలు ప్రారంభం అనంతరం ప్రెస్ మీట్ ఉండదని..పీఎంకు సమయానుభావం తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్చ మెట్రో పోస్టర్ ను ఆవిష్కరించారు. 

Don't Miss