ప్రతి 15 రోజులకు ఓ ఐటీ కంపెనీ : లోకేష్

07:35 - May 20, 2017

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ ఐటీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు యూఎస్‌ పర్యటన, అంతకుముందు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలపై ఈ సమావేశంలో చర్చించారు.. వీలైనంత త్వరగా ఐటీ కంపెనీలు మొదలయ్యేందుకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు పూర్తిచేయాలని అధికారుల్ని లోకేశ్ ఆదేశించారు.. కంపెనీలకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలను వెంటనే కల్పించాలన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనుమతుల విషయంలో ఇబ్బందులు రాకుండా ముఖ్య అధికారులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలన్నారు.. ఐటీ శాఖ అంతర్గత వెబ్‌సైట్‌లో రియల్‌ ట్రాకింగ్ సిస్టమ్‌ మరింత మెరుగుపరిచి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.

రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు
వచ్చే రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.. ప్రతి 15రోజులకు ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు.. విశాఖను ఐటీ హబ్‌గా తయారుచేసేందుకు కావాల్సిన రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు.. అలాగే వైజాగ్‌ను ప్రమోట్ చేయడానికి కార్యక్రమాలు డిజైన్‌ చేయాలన్నారు. ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, వసతులు, నూతన భవన నిర్మాణాలపై కూడా ఈ భేటీలో చర్చించారు.. సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని అధికారుల్ని ఆదేశించారు

Don't Miss